టాలీవుడ్ పని గంటలు: దీపిక నిందలు వేస్తే.. జాన్వీ ఏంటి ఇలా పొగిడేసారు!
గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమల్లో వర్క్ కల్చర్ - పని గంటలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 31 May 2026 4:24 PM ISTగత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమల్లో వర్క్ కల్చర్ - పని గంటలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె రోజుకు 8 గంటల పని దినం మాత్రమే ఉండాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలపై ఒత్తిడి తేవడంతో వరుసగా రెండు భారీ పాన్-ఇండియన్ సినిమాల్లో నటించే అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, అలాగే `కల్కి 2898 ఏడి` చిత్రాల నుంచి మేకర్స్ దీపికను నిరభ్యంతరంగా తొలగించడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ `రాకా` చిత్రం మినహా తెలుగులో దీపికకు మరే ఇతర అవకాశాలు లేవు.
దీపికా పదుకొణె నిందించిన అదే టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. టాలీవుడ్‌లో వరుసగా దేవర, పెద్ది వంటి భారీ పాన్-ఇండియన్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం `పెద్ది` సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జాన్వీ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్ ప్లానింగ్ -టైమ్ మేనేజ్‌మెంట్ ఎంతో అద్భుతంగా ఉంటాయని కొనియాడారు.
టాలీవుడ్‌లో వర్కింగ్ అవర్స్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తారని.. అక్కడ రోజుకు 9 నుండి 10 గంటల కంటే ఎక్కువ సమయం షూటింగ్ ఎప్పుడూ చేయలేదని జాన్వీ స్పష్టం చేశారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అంతే ఉత్సాహంతో పనిచేస్తారని అభినందించారు. టాలీవుడ్ పని వాతావరణం ఎంతో క్రమశిక్షణతో కూడి ఉంటుందని.. ఇక్కడి మేకర్స్ నటీనటుల సౌకర్యాలకు ఇచ్చే ప్రాధాన్యత, అలాగే గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకుందని జాన్వీ వెల్లడించారు.
ఇదే క్రమంలో తెలుగు సినీ పరిశ్రమలోని సహనటీనటుల ప్రవర్తన.. వారి క్రమశిక్షణ గురించి కూడా జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `పెద్ది` సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌లతో కలిసి పనిచేయడం తనకు మరువలేని అనుభవమని చెప్పారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా సెట్స్‌లో ఎంతో ఒదిగి ఉంటారని.. అతడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్ అని పేర్కొన్నారు. అలాగే లెజెండరీ నటుడు శివరాజ్ కుమార్ ఎనర్జీ.. సెట్స్‌లో ఆయన చూపించే క్రమశిక్షణ తనను ఎంతో ఇన్‌స్పైర్ చేశాయని.. ఇంతటి గొప్ప నటులతో కలిసి `పెద్ది` వంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలో భాగమవడం తన అదృష్టమని జాన్వీ కపూర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఒకవైపు బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె వర్కింగ్ అవర్స్ పేరుతో టాలీవుడ్ ని కించపరచగా .. మరోవైపు జాన్వీ కపూర్ ఇక్కడి పని గంటలను.. ప్లానింగ్‌ను ఓపెన్‌గా పొగడడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు అనుకూలంగా జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు దీపిక వినే ఉంటారు కదా!! తన అభిప్రాయం మార్చుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా దక్షిణాది చిత్ర పరిశ్రమ విలువలను, గౌరవాన్ని జాన్వీ కపూర్ చాటిచెప్పిన విధానం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాన్వీ నటించిన పెద్ది వచ్చే నెల 4న థియేటర్లలో విడుదల కానుంది.
