టాలీవుడ్ లో జాన్వీ దూకుడు తగ్గినట్లేనా?
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండియన్ సినిమాలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఓ రేంజ్లో హడావుడి చేసింది.
By: Srikanth Kontham | 18 Oct 2026 8:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండియన్ సినిమాలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఓ రేంజ్లో హడావుడి చేసింది. సౌత్ ఇండియన్ ఆడియన్స్ ప్రత్యేకించి తెలుగు సినీ ప్రియులు శ్రీదేవిపై ఉన్న అభిమానంతో జాన్వీకి ఘన స్వాగతం పలికారు. అగ్ర హీరోల పక్కన గ్రాండ్ కాంబినేషన్లతో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ని ఏలడం ఖాయమని భావించారు. కానీ ఆరంభంలో కనిపించిన అంచనాలు, ఊపు క్రమంగా తగ్గిపోతున్నాయా? తెలుగునాట జాన్వీ గ్రాఫ్ మెల్లగా పడిపోతోందా? అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో మొదలైంది.
`ఆర్ఆర్ఆర్` లాంటి గ్లోబల్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన `దేవర` చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్‌లో జాన్వీ హీరోయిన్గా నటించడంతో ఆమెపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ప్రమోషన్లలో పాటల్లో జాన్వీ చూపించిన గ్లామర్, శ్రీదేవిని గుర్తుచేసేలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ కాంబినేషన్ వల్ల సౌత్‌లో వరుసగా స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వెల్లువెత్తుతాయని విశ్లేషకులు భావించారు. `దేవర` తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది`లోనూ మెరిసింది. ఈ సినిమా బాగానే ఆడింది.
ఇలా ఆరంభంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేసి సంచలనం సృష్టించిన ఆ తర్వాత కొత్తగా ఏ తెలుగు ప్రాజెక్ట్‌కి సంతకం చేయకపోవడం ఆమె దూకుడు తగ్గింద నడానికి సంకేతంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోని ఇతర యంగ్ హీరోలు లేదా మీడియం రేంజ్ స్టార్ల సినిమాల్లో ఆమె నటించేందుకు మొగ్గు చూపకపోవడం.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ లేదా ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించకపోవడం వల్ల జాన్వీ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న `రాకా`లో నటిస్తోంది. కానీ అందులో హీరోయిన్ దీపిక నటిస్తుండగా...ఓ కీలక పాత్రలో మాత్రమే జాన్వీ మెరుపులు కనిపించనున్నాయి. దీంతో `రాకా` తో జాన్వీకి పెద్దగా ఒరిగేదేమి ఉండదు. మరోవైపు టాలీవుడ్లో పోటీ రోజురోజుకు తీవ్రమవుతోంది. మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి భామలు వరుసగా హిట్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జెండా పాతేస్తున్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్ మేకర్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నారు. ఈ పోటీని తట్టుకుని జాన్వీ నిలబడటం కష్టమే అన్న మాట వినిపిస్తోంది. మరి ఈ ఫేజ్ ను దాటి జాన్వీ టాలీవుడ్ తదుపరి అడుగు ఎలా ఉంటుందన్నది చూడాలి.
