తెలుగు దర్శకుడి సలహా జాన్వీ వింటుందా?
అయితే తెలుగు దర్శకుడు, ఓదెలా 2 ఫేం అశోక్ తేజ ఇప్పుడు జాన్వీ కపూర్ కెరీర్ జర్నీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి.
By: Sivaji Kontham | 15 Nov 2025 1:00 AM ISTఅవును.. జాన్వీకపూర్ ని అతడు నియంత్రిస్తున్నాడు. ఫలానా పరిశ్రమలో మాత్రమే నటించాలని, తిరిగి హిందీ చిత్రసీమకు వెళ్లొద్దని సలహాలిస్తున్నాడు. సక్సెస్ కావాలంటే తెలుగు పరిశ్రమనే నమ్ముకోవాలని కూడా సూచించాడు. అయితే జాన్వీకపూర్ సదరు తెలుగు దర్శకుడి మాటలు వింటుందా? అతడు ఇచ్చిన సలహా ఏమిటి? అది నిజంగా అంత విలువైనదా? వివరాల్లోకి వెళితే..
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ ఇటీవల పూర్తిగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం బాలీవుడ్ లో ఈ అమ్మడికి అస్సలు ఏదీ కలిసి రాకపోవడమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న పరమ్ సుందరి, సన్నీ సంస్కారికి తులసీ కుమారి లాంటి చిత్రాలు ఫ్లాపులయ్యాయి. అంతకుముందు కూడా కొన్ని వరుస యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంది. హిందీ చిత్రసీమలో జాన్వీ కెరీర్ ఆశించినంతగా వెలగలేదనడానికి ఇవన్నీ సంకేతాలు. జాన్వీకి ఒకదాని వెంట ఒకటిగా అవకాశాలు వచ్చినా కానీ, ఇవేవీ బ్లాక్ బస్టర్లు కావడం లేదు. అందువల్ల రష్మిక మందన్న, కియరా రేంజులో దూసుకుపోవడం ఈ అమ్మడికి కుదరడం లేదు.
అయితే తెలుగు దర్శకుడు, ఓదెలా 2 ఫేం అశోక్ తేజ ఇప్పుడు జాన్వీ కపూర్ కెరీర్ జర్నీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. అతడి ప్రకారం .. జాన్వీ ఇప్పుడు సరైన చోటులోనే ఉంది. జాన్వీకి హిందీలో కంటే తెలుగులోనే క్రేజ్ ఎక్కువ. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు గనుక ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అందువల్ల జాన్వీ ఎదగాలని ఇక్కడ అందరూ పాజిటివ్ గా కోరుకుంటారు. అందువల్ల జాన్వీ టాలీవుడ్ అవకాశాలను వదులుకోకూడదని, ఇక్కడే కొనసాగాలని కూడా అశోక్ కోరుకున్నారు.
అయితే అతడి వ్యాఖ్యలను కొందరు తప్పు పడుతున్నారు. జాన్వీ కపూర్ ని ఒకే పరిశ్రమకు కట్టుబడి ఉండాలని నియంత్రిస్తున్నారా? అని ప్రశ్నించారు. హద్దు దాటాడని కొందరు విమర్శించారు. అతడు ఆమె కెరీర్ గురించి మాట్లాడకూడదని కూడా అన్నారు.
అయితే అశోక్ సలహాను జాన్వీ కపూర్ లైట్ తీసుకోకూడదు. అభిమానులూ అర్థం చేసుకోవాలి. అతిలోక సుందరి శ్రీదేవిని తెలుగు ప్రజలు తమ సొంత మనిషిగా, తమ ఇంటి ఆడపడుచుగా అభిమానించి ప్రేమిస్తారు. శ్రీదేవి కోసం చెవి కోసుకునే ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. మామ్ ఇప్పుడు లేకపోయినా .. తన కోసం ప్రారంభమైన అభిమాన సంఘాలు దశాబ్ధాలుగా యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ జాన్వీకి అదనపు బలంగా మారుతుంది. ఒకవేళ జాన్వీకపూర్ హిందీ పరిశ్రమ మత్తులో అక్కడికి వెళ్లినా తనకు నటవారసురాళ్ల నుంచి బలమైన పోటీ ఉంది. అక్కడ గుంపులో గోవిందంలా తనను పట్టించుకునేవాళ్లు ఉండరు. ఇక్కడ అలా కాదు.. ప్రజలు జాన్వీలో శ్రీదేవిని చూసుకోవడానికి పోటీపడతారు. ఇవన్నీ జాన్వీ అర్థం చేసుకుంటుందనే భావిద్దాం.
ఎన్టీఆర్ సరసన `దేవర-1`లో నటించిన జాన్వీ తదుపరి రామ్ చరణ్ పెద్దిలోను కీలక పాత్రతో మెప్పించనుంది. ఎన్టీఆర్, చరణ్ తర్వాత బన్ని, ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలతో జాన్వీ అవకాశాలు అందుకోవడం కష్టమేమీ కాదని కూడా విశ్లేషిస్తున్నారు. చరణ్ సరసన పెద్ది చిత్రం నుంచి విడుదలైన తొలి సింగిల్ గ్లింప్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. దేవర తర్వాత పెద్ది కూడా పెద్ద విజయం సాధించి జాన్వీకి బిగ్ బూస్ట్ నిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
