సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!
సౌత్ సినిమా దర్శకుల పనితీరుపై ఇటీవల వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ కపూర్ తాజాగా తమిళ ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాలపై తనకున్న ఆసక్తిని వెల్లడించారు. విజయ్ ‘పోకిరి’, వెట్రిమారన్ సినిమాలు, ‘బొమ్మరిల్లు’ తనకు ఇష్టమని చెప్పారు. దీంతో విమర్శల నుంచి బయటపడేందుకే జాన్వీ ఇలా మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 8 Nov 2026 4:43 PM ISTబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య సౌత్ సినిమా దర్శకుల పని తీరుపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న ఈ అమ్మడు.. ఇప్పుడు తన తాజా ఇంటర్వ్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సౌత్ సినిమాల గురించి, తెలుగు, తమిళ చిత్రాల గురించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో.. జాన్వీ కపూర్ రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ సౌత్ సినిమా దర్శకుల పని తీరుపై.. కొన్ని వ్యాఖ్యలు చేసింది. సౌత్ సినిమాల్లో ముందుగానే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయరని, కెమెరా యాంగిల్స్ కూడా సరిగ్గా చెప్పారని చెప్పింది. ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. దక్షిణాది సినిమా పరిశ్రమల గురించి సరైన అవగాహన లేకుండా మాట్లాడిందంటూ పలువురు విమర్శించారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే.. జాన్వీ తన పిన్ని మహేశ్వరితో కలిసి ఒక తమిళ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్వరి ఇటీవల చూసిన తమిళ సినిమా ఏదని అడగ్గా, జాన్వీ మొదట సినిమా పేరు గుర్తు చేసుకోలేకపోయింది. కొన్ని వివరాలు చెప్పడంతో మహేశ్వరి ఆమెకు హెల్ప్ చేసింది. చివరకు ప్రీతి ముకుందన్ నటించిన బ్లాస్ట్ సినిమా చూసినట్లు జాన్వీ చెప్పింది.
అంతేకాదు..తమిళ సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి కూడా మాట్లాడింది. విజయ్ నటించిన 'పోకిరి' సినిమాను చూసినట్లు తెలిపింది. దర్శకుడు వెట్రిమారన్ సినిమాలు తనకు ఇష్టమని ప్రశంసించింది. తన తండ్రి బోనీ కపూర్ రీమేక్ చేసిన సినిమాలను కూడా చూస్తుంటానని చెప్పింది. ముఖ్యంగా సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేసుకుంది.
అయితే జాన్వీ మాటలకు ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సౌత్ సినిమా పరిశ్రమలపై ఈ మధ్యనే విమర్శలు చేసిన ఆమెకు ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగు, తమిళ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
దక్షిణాది ప్రేక్షకుల ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి, తనపై వచ్చిన విమర్శల నుంచి బయటపడటానికి జాన్వీ ఇలా మాట్లాడుతోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
