ప్రతి రోజు ఒక కొత్త బ్రాండ్: కోట్లు కొల్లగొడుతున్న జాన్వీ!
బాలీవుడ్ స్టార్ కిడ్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ వెండితెరపైనే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 3 July 2026 4:00 AM ISTబాలీవుడ్ స్టార్ కిడ్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ వెండితెరపైనే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.67 కోట్లకు పైగా ఉన్న ఫాలోయింగ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉన్న క్రేజ్‌ను ఈ యంగ్ బ్యూటీ క్యాష్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఈ భామతో ప్రమోషన్స్ చేయించేందుకు క్యూ కడుతుండటంతో జాన్వీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల డిజిటల్ షోరూమ్‌లుగా మారిపోయాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్ పోస్ట్ చేసే ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ వెనుక భారీ వ్యాపార సామ్రాజ్యం దాగి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ భామ ఒకే ఒక్క యాడ్ పోస్ట్ లేదా రీల్ కోసం సుమారు 7 లక్షల నుండి 10 లక్షల వరకు వసూలు చేస్తోంది. అలాగే ఎక్స్ ఖాతాలో చేసే పోస్టులకు లక్షల్లో డిమాండ్ చేస్తోంది. కేవలం విడివిడి పోస్టులే కాకుండా ఒప్పో, లెన్స్‌కార్ట్, తుమి, హావెల్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలకు గంపగుత్తగా (బల్క్ ప్యాకేజీ) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఏడాదికి 1 కోటి నుండి 2.5 కోట్ల వరకు ఒప్పందాలు కుదుర్చుకుంటోందని టాక్ వినిపిస్తోంది.
నెలవారీ లెక్కలు చూస్తే.. జాన్వీ కపూర్ డిజిటల్ ఆదాయం ఊహకందని స్థాయిలో ఉంది. ఒక నెలలో కనీసం డజనుకు పైగా విభిన్న బ్రాండ్స్ (లైఫ్ స్టైల్, గ్యాడ్జెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్) ప్రకటనలను నిరంతరాయంగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ రకంగా చూసినా.. సోషల్ మీడియా వేదికల ద్వారానే ఈ బ్యూటీ నెలవారీ ఆదాయం 1.5 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్లో ఇంతటి క్రేజ్, కమర్షియల్ వాల్యూ ఉన్న మరో స్టార్ బ్యూటీ బాలీవుడ్‌లో లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కేవలం డిజిటల్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా... సినిమాల పరంగానూ జాన్వీ కపూర్ పారితోషికం ఆకాశాన్ని తాకుతోంది. హిందీ చిత్రసీమలో ఈ భామ నటిస్తున్న ఒక్కో సినిమాకు బడ్జెట్ - ప్రొడక్షన్ హౌస్‌ను బట్టి సుమారు 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలకు సమన్యాయం చేస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఈ యంగ్ బ్యూటీ అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదు.
మరోవైపు.. సౌత్ ఇండియాలో (టాలీవుడ్‌లో) జాన్వీ కపూర్ ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన `దేవర` చిత్రానికి గానూ దాదాపు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ `పెద్ది` కోసం దాదాపు 4 కోట్ల పారితోషికాన్ని వసూలు చేసిందని ప్రచారం ఉన్నా.. దానిపై అధికారికంగా క్లారిటీ లేదు. ఇలా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జాన్వీ కపూర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
