Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ తప్పు ఏముంది ఇందులో..?

నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం తను పెట్టి సినిమా పైన చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   29 Oct 2026 2:38 PM IST
జాన్వీ కపూర్ తప్పు ఏముంది ఇందులో..?
X

నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం తను పెట్టి సినిమా పైన చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆమెను విమర్శిస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటి అంటే.. హీరోయిన్‌ను మాత్రమే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్.

జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో పాత్ర వల్ల ఎన్నో వివాదాలు ఎదుర్కొంది.. సాధారణంగా ఒక సినిమా కథ, అందులో హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి అనేది ప్రధానంగా దర్శకుడు, రచయిత నిర్ణయిస్తారు. అలాంటప్పుడు ఆ పాత్ర విషయంలో హీరోయిన్‌ను మాత్రమే ఎందుకు విమర్శించాలి అనేది చాలామందికి వచ్చే ప్రశ్న.

సినిమా అనేది ఎంతోమంది కలిసి చేసే పని. దర్శకుడు కథ రాస్తారు. రచయిత పాత్రలను రూపొందిస్తారు. ఆ పాత్రలకు అనుగుణంగా నటీనటులు నటిస్తారు. ఒక సినిమాలో హీరోయిన్ పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, ఆమె పాత్రను కేవలం పాటలు, ప్రేమ సన్నివేశాలకే పరిమితం చేసినా దానికి హీరోయిన్ ఒక్కరినే బాధ్యురాలిగా చేయలేం.

హీరోయిన్లు కూడా తమ వృత్తిని గౌరవిస్తారు. తమకు ఇచ్చిన పాత్రలో దర్శకుడు చెప్పిన విధంగా నటించడం వారి పని. ఒక పాత్రను అంగీకరించినంత మాత్రాన అందులోని ప్రతి అంశానికి హీరోయిన్ మాత్రమే బాధ్యత వహించాలని చెప్పడం సరైన పద్ధతి కాదు.

అయితే హీరోయిన్‌కు కూడా తన పాత్ర గురించి ప్రశ్నించే హక్కు ఉంటుంది. కథ విన్న తర్వాత సినిమా చేయాలని నిర్ణయించుకోవడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి బాధ్యత అనేది దర్శకుడు, రచయిత, నటి.. ఇలా సినిమా నిర్మాణంలో భాగమైన అందరికీ ఉంటుంది.

చాలా సినిమాల్లో హీరో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, హీరోయిన్ పాత్రను మాత్రం పరిమితం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. హీరోయిన్లకు కూడా కథలో బలమైన పాత్రలు, మంచి సంభాషణలు, నటనకు అవకాశం ఉండే సన్నివేశాలు రాయాలి.

జాన్వీ కపూర్ విషయంలో కూడా ఒక నటిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కంటే, ఆమె పాత్రను ఎలా రాశారు.. దర్శకుడు ఎలాంటి ఆలోచనతో ఆ పాత్రను రూపొందించారు.. అనే విషయాలను చర్చించడం అవసరం. అలాకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది జాన్వి కపూర్ పైనే నింద మొత్తం వేసేస్తున్నారు. ఇది తప్పకుండా కరెక్ట్ కాదనే చెప్పాలి.

హీరోయిన్లను విమర్శించడం సులభమే.. కానీ వారి పాత్రలను రాసే దర్శకులు, రచయితల బాధ్యతను కూడా ప్రశ్నించాలి. అప్పుడే సినిమా పరిశ్రమలో మహిళా పాత్రలకు సరైన ప్రాధాన్యత లభిస్తుంది.