Begin typing your search above and press return to search.

అప్పుడు ఓకే.. మరి ఇప్పుడేమైంది జాన్వీ?

హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లోనూ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   15 May 2026 12:50 PM IST
అప్పుడు ఓకే.. మరి ఇప్పుడేమైంది జాన్వీ?
X

హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లోనూ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే దిశగా ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దేవర ప్రమోషన్స్‌ లో చురుగ్గా పాల్గొన్న జాన్వీ.. ఇప్పుడు పెద్ది విషయంలో ఎందుకు సైలెంట్‌ గా ఉన్నారనే ప్రశ్న వినిపిస్తోంది.

2018లో బాలీవుడ్‌ లో ధడక్ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, మొదట్లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్నా.. తర్వాత యాక్టింగ్ కు స్కోప్ ఉన్న కథలను కూడా ఎంపిక చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది దేవర సినిమాతోనే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించారు.

దేవర పార్ట్-1లో జాన్వీ పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ.. ఆమె కనిపించిన పాటలు మాత్రం ఫుల్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా చుట్టమల్లే, దావూదీ పాటల్లో ఎన్టీఆర్‌ తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, కథ పరంగా అసలు డ్రామా దేవర పార్ట్-2లో ఉంటుందని స్వయంగా జాన్వీ చెప్పడం కూడా అప్పట్లో ఆసక్తి పెంచింది.

అయితే సినిమాకు ముందు జరిగిన ప్రమోషన్స్‌ లో మాత్రం జాన్వీ యాక్టివ్‌ గా కనిపించారు. ముంబై ట్రైలర్ లాంచ్ నుంచి చెన్నై ప్రెస్ మీట్ వరకు వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేయడానికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చెన్నై ఈవెంట్‌ లో తమిళంలో మాట్లాడి సర్ప్రైజ్ చేశారు. మొత్తంగా దేవర ప్రమోషన్స్‌ లో ఆమె కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

ఇప్పుడు అదే జాన్వీ.. తన రెండో తెలుగు చిత్రం పెద్ది విషయంలో మాత్రం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ అచ్చియ్యమ్మ అనే పవర్‌ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కుటుంబానికి చెందిన ధైర్యమైన అమ్మాయిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, చికిరి చికిరి పాటలో జాన్వీ పూర్తిగా పల్లెటూరి అమ్మాయి లుక్‌ లో కనిపించారు. అందుకే సినిమా ఆమెకు నటిగా మరింత గుర్తింపు తీసుకురావొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయితే సినిమా విడుదలకు ఇంకా దాదాపు 20 రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పటివరకు జాన్వీ ప్రమోషనల్ ఈవెంట్లలో కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా సందడి చేయడం లేదు.

పెద్ది పాన్ ఇండియా చిత్రం కావడంతో.. బాలీవుడ్ మార్కెట్ పరంగా జాన్వీ ప్రమోషన్స్‌ కు రావడం సినిమాకు ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో దేవర సమయంలో ఫుల్ యాక్టివ్‌ గా కనిపించిన జాన్వీ.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ గా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఆమె ప్రమోషన్స్‌ లో పాల్గొనే అవకాశం ఉంది. మరి లాస్ట్ స్టేజ్ లో ప్రమోషన్స్ లో జాన్వీ ఎంతవరకు యాక్టివ్‌ గా కనిపిస్తారో చూడాలి.