అమ్మను బాధపెట్టారంటూ జాన్వీ కపూర్ వ్యాఖ్యలు!
అప్పట్లో ఆ విషయాలను కేవలం వార్తలుగానే చూశానని కానీ ఇప్పుడు తను కూడా అదే సినీ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక మహిళగా తన తల్లి ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవించి ఉంటుందో అర్థమవుతోందంది.
By: Srikanth Kontham | 8 April 2026 9:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా శ్రీదేవి వెండితెరపై ఎంతటి వైభవాన్ని చూశారో? తెర వెనుక వ్యక్తిగత జీవితంలో అంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నారనేది కాదనలేని నిజం. తాజాగా ఆమె కుమార్తె నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తల్లి బ్రతికి ఉన్న సమయంలో సమాజం , మీడియా ఆమె పట్ల కనీస దయ చూపించలేదని ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ రకరకాల మాటలతో ఇబ్బందులకు గురిచేశారని జాన్వీ ఆవేదన చెందింది. చిన్నతనంలో తన తల్లి గురించి బయట వినిపించే మాటలు లేదా పత్రికల్లో వచ్చే వార్తలు తనకు పెద్దగా అర్థమయ్యేవి కావని జాన్వీ గుర్తు చేసుకుంది.
అప్పట్లో ఆ విషయాలను కేవలం వార్తలుగానే చూశానని కానీ ఇప్పుడు తను కూడా అదే సినీ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక మహిళగా తన తల్లి ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవించి ఉంటుందో అర్థమవుతోందంది. సెలబ్రిటీ హోదాలో ఉంటే వ్యక్తిగత గోప్యతకు విలువే ఉండదా? అనే ప్రశ్న ఆమె మాటల్లో ప్రతిబింబించింది. శ్రీదేవి పెళ్లి ఆమె వ్యక్తిగత నిర్ణయాల పట్ల అప్పట్లో జరిగిన ప్రచారం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. అవి ఆమెను ఒక వ్యక్తిగా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాయని జాన్వీ అభిప్రాయపడింది.
ఒక స్టార్ ఎంత ఎత్తుకు ఎదిగినా? సమాజం వారి బలహీనతలను వెతికి పట్టుకుని వేధించడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతుందంది. ఆ సమయంలో తన తల్లికి అండగా నిలబడే వారి కంటే వేలెత్తి చూపించేవారే ఎక్కువగా ఉన్నారని భావోద్వేగానికి గురైంది. నటిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత జాన్వీకి ఈ ఫీల్డ్‌లోని లోటుపాటులు పూర్తిగా అర్థమయ్యాయి. బయటకు కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉంటాయో? ముఖ్యంగా మహిళా నటుల పట్ల లోకం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్వయంగా అనుభ విస్తున్నానంది.
తన తల్లి పట్ల అప్పట్లో చూపించిన అసహనం, అగౌరవం ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధగా ఉందని వాపోయింది . ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నటిగా జాన్వీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పని లేదు. మామ్ శ్రీదేవి వేసిన మార్గంలో దిగ్విజయంగా ముందుకెళ్తోంది. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. `దేవర`తో టాలీవుడ్ లో లాంచ్ అయిన బ్యూటీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా `పెద్ది` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే కోలీవుడ్ లో కూడా లాంచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అవసరమైన ప్రణాళికను డాడ్ బోనీ కపూర్ సిద్దం చేస్తున్నారు.
