Begin typing your search above and press return to search.

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

హీరోయిన్ కావాలంటే అందంగా ఉండాలా? జాన్వీ కపూర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ చర్చకు తెరతీశాయి. ముక్కు సర్జరీ తర్వాత తనపై తల్లి శ్రీదేవికి నమ్మకం వచ్చిందని సరదాగా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సర్జరీలు వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ, సహజమైన అందంతోనే సావిత్రి నుంచి సాయి పల్లవి వరకు ఎంతోమంది హీరోయిన్లు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   9 Nov 2026 9:55 AM IST
హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?
X

హీరోయిన్లు అంటే అందంగా ఉండాలా.. ఇప్పుడు ఈ ప్రశ్న మరోసారి జాన్వి కపూర్ వల్ల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. జాన్వి కపూర్ తెలిసి మాట్లాడుతుందో, తెలియక మాట్లాడుతుందో.. తెలియదు కానీ.. ఆమె మాట్లాడే ప్రతి మాట ప్రస్తుతం మాత్రం ఎన్నో వివాదాలుకు దారితీస్తోంది.

ఈ మధ్యనే ఈ హీరోయిన్ పెద్ది సినిమా విషయంలో సౌత్ దర్శకులపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు హీరోయిన్.. రూపురేఖలపై వివాదాలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆమె మాటలు విన్న తర్వాత హీరోయిన్లు కావాలనుకునే అమ్మాయిలు, సాధారణ యువతులు తమ సహజమైన అందం గురించి ఆలోచించే పరిస్థితి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల జాన్వి కపూర్ ఆమె పిన్ని మహేశ్వరి తో.. ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. మొదట్లో తాను సినిమాల్లోకి రావడంపై శ్రీదేవికి అంతగా ఆసక్తి లేదని జాన్వీ వెల్లడించింది. అయితే ముక్కు సర్జరీ చేయించుకున్న తర్వాత తన తల్లికి తనపై నమ్మకం వచ్చిందని సరదాగా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జాన్వి కపూర్ కేవలం.. తన లైఫ్ లో జరిగిందే చెప్పి ఉండవచ్చు. కానీ ఒక హీరోయిన్ మాట్లాడేటప్పుడు.. చాలా విషయాలు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్లు మాట్లాడేవి నేటితరం యువకులపై కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలామంది జాన్వి వ్యాఖ్యాలపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

ఇలాంటి మాటలు విన్నప్పుడు సాధారణ అమ్మాయిల్లో అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది. హీరోయిన్ కావాలంటే ముక్కు, ముఖం అందంగా ఉండాలని, సహజమైన రూపంలో మార్పులు చేసుకోవాలని భావించే పరిస్థితి రావచ్చు. కానీ మన సినిమా ఇండస్ట్రీలో కేవలం అందం అనేదే కీలక పాత్ర అయితే పోషించడం లేదు.. అని ఎంతోమంది ప్రూవ్ చేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు.

ఒకప్పుడు సావిత్రి నుంచి ఇప్పటి సాయి పల్లవి వరకు ఎంతోమంది హీరోయిన్లు తమ సహజమైన అందంతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ తరంలోనే..సాయి పల్లవి సహజమైన రూపంతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలా ఎటువంటి సర్జరీ చేసుకోకుండా హీరోయిన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.

సర్జరీలు చేయించుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కానీ హీరోయిన్ కావాలంటే అందులో మార్పులు తప్పనిసరి అనే భావన మాత్రం సరైంది కాదు. ఈ క్రమంలో ఏకంగా శ్రీదేవి లాంటి హీరోయిన్ తన కూతురికి అలాంటి మాటలు చెప్పింది అని తెలియడంతో.. చాలామంది.. ఆశ్చర్యపోవడమే కాకుండా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు.