Begin typing your search above and press return to search.

అతిలోక సుంద‌రి గ‌ర్వించేలా జాన్వీ కోలీవుడ్ డెబ్యూ?

ఒకసారి గతంలోకి వెళ్తే.. జాన్వీ తల్లి, లెజెండరీ నటి శ్రీదేవి కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరంగేట్రాన్ని అందుకున్నారు.

By:  Sivaji Kontham   |   2 July 2026 9:23 AM IST
అతిలోక సుంద‌రి గ‌ర్వించేలా జాన్వీ కోలీవుడ్ డెబ్యూ?
X

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై గట్టిగానే దృష్టి సారించింది. ఇప్పటికే తన తల్లికి ఎంతో ఇష్టమైన టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఇక్కడ వరుసగా రెండు పెద్ద సినిమాలతో భారీ విజయాలను దక్కించుకుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర ఘ‌న‌విజ‌యం సాధించ‌గా, రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం అందుకుంది. తెలుగులో సాధించిన సక్సెస్ జోష్‌తో ఇప్పుడు తమిళ పరిశ్రమ (కోలీవుడ్) పై కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై..దర్శకుడు సర్గుణం తెరకెక్కించనున్న `కురత్తి` అనే వెబ్ సిరీస్ ద్వారా జాన్వీ కపూర్ తమిళంలోకి అడుగుపెట్టబోతోందని ప్రచారం సాగుతోంది. ఇందులో జాన్వీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుండి కానీ.. జాన్వీ నుండి కానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఒక వెబ్ సిరీస్ తో జాన్వీ కోలీవుడ్ డెబ్యూ ఉండబోతోందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని క‌లిగించ‌డమే కాదు.. కొంత‌ ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఒకసారి గతంలోకి వెళ్తే.. జాన్వీ తల్లి, లెజెండరీ నటి శ్రీదేవి కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరంగేట్రాన్ని అందుకున్నారు. 1967లో వచ్చిన `కందన్ కరుణై` అనే భక్తిరస చిత్రంలో కేవలం నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి.. ఆ తర్వాత 1976లో లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ `మూండ్రూ ముడిచ్చు` చిత్రంతో 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. అంతటి గొప్ప దర్శకుడితో కెరీర్ ప్రారంభించే అవకాశం శ్రీదేవికి దక్కింది.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాన్వీ కపూర్‌కు అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్‌తో డెబ్యూ ఛాన్స్ సాధ్యపడేలా కనిపించడం లేదు.

శ్రీదేవికి ఉన్న గొప్ప‌ ఇమేజ్ దృష్ట్యా.. జాన్వీ కపూర్ తమిళంలో కూడా ఒక పెద్ద కమర్షియల్ సినిమాతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని తమిళ ప్రేక్షకులు, అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సరసన పెద్ద ప్రాజెక్టులతో అడుగుపెట్టినట్లే.. కోలీవుడ్‌లో కూడా ఒక క్రేజీ స్టార్ హీరో సినిమాతోనే ఆరంగేట్రం చేయాలని ఆశిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ వార్తలపై గానీ..కోలీవుడ్ ఎంట్రీపై గానీ అటు జాన్వీ కపూర్ కానీ, త‌న‌ తండ్రి బోనీ కపూర్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

శ్రీదేవి తమిళ చిత్రసీమలో ఒక శకానికి తెరతీసిన సూపర్ స్టార్. చెన్నైలోనే స్థిరపడి, మద్రాసు పరిశ్రమ నుండి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించి ఇక్కడా నెంబర్ వన్‌గా ఏలారు. ఆ తర్వాత బాలీవుడ్‌ను సైతం సుదీర్ఘ కాలం పాటు శాసించిన మేటి నాయికగా చరిత్ర సృష్టించారు. తల్లికి తమిళనాట ఉన్న ఆ సెంటిమెంట్.. క్రేజ్ దృష్ట్యా జాన్వీ కపూర్‌కు ఈ తమిళ ఆరంగేట్రం ఎంతో కలిసి రావాల్సి ఉంది. అందుకే వెబ్ సిరీస్‌లతో కాకుండా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఒక బ్లాక్ బస్టర్ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ డెబ్యూ జరగాలని.. తన తల్లి గర్వపడేలా ఆ అడుగు ఉండాలని `అతిలోక సుందరి` అభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.