Begin typing your search above and press return to search.

పెళ్లితో జాన్వీ కపూర్‌ మరో ప్రయోగానికి రెడీ..!

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది.

By:  Ramesh Palla   |   15 Oct 2025 12:22 PM IST
పెళ్లితో జాన్వీ కపూర్‌ మరో ప్రయోగానికి రెడీ..!
X

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. ధడక్‌ సినిమా నుంచి మొదలుకుని ఇప్పటి వరకు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టలేదు, హిట్‌ ను తెచ్చి పెట్టలేదు. అయినా కూడా బాలీవుడ్‌లో మంచి ఆఫర్లను దక్కించుకుంటుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈమె సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈమె ఇప్పటికే దేవర సినిమాను చేసింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా, అందులో పాత్ర విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ కు జోడీగా పెద్ది సినిమాలో బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పెద్ది సినిమా కోసం జాన్వీ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో మరో సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు గాను జాన్వీ కపూర్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కానీ ఆమె గత చిత్రాల ఫలితాల కారణంగా పెద్ద ప్రాజెక్ట్‌ల్లో ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రయోగాత్మక సినిమాలు చేయాల్సి వస్తోంది. ఇటీవల పరమ్ సుందరి, సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్‌ నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాదిలో జాన్వీ కపూర్ నుంచి వచ్చిన మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేక పోయాయి. దాంతో మరోసారి జాన్వీ కపూర్‌ ప్రయోగాన్ని చేసేందుకు రెడీ అయింది. జస్మీత్‌ కె రీన్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా వివాహం అనే కాన్సెప్ట్‌ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.

యానిమల్‌ సినిమా నిర్మాత బ్యానర్‌లో జాన్వీ మూవీ

కబీర్‌ సింగ్‌, యానిమల్‌, భూల్‌ భూలయ్యా 2 వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించిన మురాద్‌ ఖేతాని ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆలియా భట్ తో డార్లింగ్స్ అనే విభిన్నమైన సినిమాను రూపొందించడం ద్వారా విమర్శకుల దృష్టిని ఆకర్షించి, ప్రేక్షకులను మెప్పించిన జస్మీత్‌ కె రీన్‌ ఈ సినిమాతో మరోసారి బోల్డ్‌ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయింది. జాన్వీ కపూర్‌ యొక్క బోల్డ్‌ లుక్‌ను ఇప్పటి వరకు చూశాం. కానీ ఈసారి బోల్డ్‌ పాత్రలో జాన్వీ కపూర్‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ ను ఇప్పటి వరకు చూడని విధంగా జస్మీత్‌ చూపించడం వల్ల ఆమె కెరీర్‌కి ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జాన్వీ కపూర్‌ మాత్రం ఈ పాత్ర విషయమై ప్రస్తుతానికి మౌనంగా ఉంది. ఆమె నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా జస్మీత్‌ కె రీన్‌ దర్శకత్వంలో..

గత ఏడాది నాలుగు సినిమాలతో వచ్చిన జాన్వీ కపూర్‌కి దేవర సినిమా కాస్త ఊరటను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇన్ని ఫ్లాప్స్ పడుతున్నా కూడా జాన్వీ కపూర్‌ కి ఆఫర్లు రావడంకు కారణం ఖచ్చితంగా ఆమె అందం, సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ అనడంలో సందేహం లేదు. ఆమె యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీదేవి కూతురు అయినప్పటికీ ఈమెకు హిట్స్ పడకుంటే ఆఫర్లు వచ్చే అవకాశం తక్కువే. కానీ ఈమె అందంగా కనిపించడం వల్లే హీరోయిన్‌గా ఆఫర్లను దక్కించుకుంటూనే వచ్చింది. కొత్త ప్రాజెక్ట్‌తో జాన్వీ కపూర్‌ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సరికొత్త ప్రయోగంతో అయినా జాన్వీ కపూర్‌కి బాలీవుడ్‌లో హిట్‌ పడేనా చూడాలి.