సంక్రాంతి నుంచి బిగ్ స్టార్ ఔట్?
సంక్రాంతి పండుగ.. టాలీవుడ్ కు ఎంత కీలకమైన సీజనో అందరికీ తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా సినిమాలు.. భారీ వసూళ్లు రాబడుతాయి.
By: M Prashanth | 14 Dec 2025 9:58 PM ISTసంక్రాంతి పండుగ.. టాలీవుడ్ కు ఎంత కీలకమైన సీజనో అందరికీ తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా సినిమాలు.. భారీ వసూళ్లు రాబడుతాయి. అందుకే ఏటా పొంగల్ కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా అలాంటి సీనే రిపీట్ కానుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు విడుదలవుతున్నాయి. వాటితోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి.
అవే విజయ్ దళపతి జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు), శివ కార్తికేయన్ పరాశక్తి. అయితే సాధారణంగా సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా చాలు.. ప్లాన్ చేసుకుని ఆడియన్స్ చూసేస్తారు. కానీ ఈసారి 7 సినిమాలు అంటే.. అన్నీ చూడటం కష్టమే. దీంతో ఏవో కొన్ని సినిమాలు అయినా వాయిదా పడితే బెటర్ అని అంతా అభిప్రాయపడుతున్నారు.
కానీ మరో నెల రోజుల సమయం ఉన్నా.. ఏ మూవీ కూడా డ్రాప్ అవుతున్నట్లు ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి విజయ్ దళపతి తప్పుకుంటారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన జన నాయగన్.. జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇటీవల జనవరి 10న సినిమాను విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా సంక్రాంతి రేసు నుంచి సినిమా వైదొలుగుతుందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని వినికిడి. ఇందులో నిజమెంతో తెలియకపోయినా.. ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, జన నాయగన్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేటట్టు కనిపిస్తున్నారు. దీంతో హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న జన నాయగన్ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. దీంతో జన నాయగన్ సినిమా ఎలా ఉంటుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
