Begin typing your search above and press return to search.

డబ్బులు వెనక్కిచ్చేస్తున్న జననాయగన్

విజయ్ ముఖ్యమంత్రి అయిన ఉత్సాహంలో ఆయన చివరి చిత్రాన్ని థియేటర్లలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఎదురు చూస్తున్న అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది.

By:  Garuda Media   |   6 Jun 2026 1:09 PM IST
డబ్బులు వెనక్కిచ్చేస్తున్న జననాయగన్
X

ఐదు నెలల ముందు సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన సినిమా జననాయగన్. కానీ సెన్సార్ సమస్యలతో అనూహ్యంగా రిలీజ్ ఆగిపోయింది. జనవరి 9న రిలీజ్ కుదరకపోయినా.. ఇంకొన్ని రోజుల్లో సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుందిలే అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యంగా ఆ చిత్రం నెలల తరబడి విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఐతే గత నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఈ చిత్రానికి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే అని భావించారు. కానీ విజయ్ సీఎం అయి నెల కావస్తున్నా ‘జననాయగన్’కు మోక్షం కలగలేదు. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప సినిమా బయటికి రావడం లేదు. కనీసం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు.

విజయ్ ముఖ్యమంత్రి అయిన ఉత్సాహంలో ఆయన చివరి చిత్రాన్ని థియేటర్లలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఎదురు చూస్తున్న అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది. అసలు ఇప్పుడీ చిత్రాన్ని విడుదల చేయడంలో సమస్య ఏంటి అన్నది అంతుబట్టకుండా ఉంది. ఇలాంటి టైంలో ఒక లేటెస్ట్ న్యూస్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘జననాయగన్’ అనుకున్న రిలీజ్ డేట్ నుంచి ఐదు నెలలు ఆలస్యం అయిన నేపథ్యంలో బయ్యర్ల అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసి, వారికి రీఫండ్ చేయబోతున్నాడట నిర్మాత నారాయణ. స్వయంగా విజయే ఈ మేరకు సూచించినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బయ్యర్ల నుంచి తీసుకున్న డబ్బులకు వడ్డీ వేసి మరీ ఇచ్చేయబోతున్నారట.

తర్వాత సినిమాకు సెన్సార్ సహా అన్ని అడ్డంకులూ తొలగిపోయాక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్సే సొంతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటుందట. సంక్రాంతికి రిలీజ్ ఆగిపోవడం, ఇంత ఆలస్యం కావడం వల్ల నిర్మాతకు దాదాపు రూ.200 కోట్ల నష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి చివరగా లెక్కలు చూసి, నిర్మాతకు తలెత్తే నష్టాలను విజయ్ భర్తీ చేయాలనుకుంటున్నాడని.. పారితోషకం నుంచి మినహాయించుకోవడం లేదంటే భవిష్యత్తులో కుదిరితే ఇంకో సినిమా చేయడం లాంటి సెటిల్మెంట్ జరగొచ్చని తెలుస్తోంది.