డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నిర్మాత!
ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని(మెగా 158) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 5 Jun 2026 10:47 AM ISTప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని(మెగా 158) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ లాంచింగ్ వేడుకలో మెగా ప్రొడ్యూసర్, కేవీఎన్ అధినేత వెంకట్ కే నారాయణన్ ఎంతో ఉత్సాహంగా సందడి చేస్తూ కనిపించారు. అయితే అంతటి వేడుకలోనూ ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పెద్ద టెన్షన్ నడుస్తోంది. దళపతి విజయ్ కథానాయకుడిగా కేవీఎన్ బ్యానర్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం `జననాయగన్` రిలీజ్ డైలమా .. సెన్సార్ పరంగా ఎదురవుతున్న అడ్డంకులు ఆయనను కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసినదే.
మెగా సినిమా లాంచింగ్ ముగిసిన వెంటనే కేవీఎన్ అధినేత వెంకట్ పూర్తిగా `జననాయగన్` సినిమా వ్యవహారాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ డ్రామా చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటమే కాకుండా, ఇప్పటివరకు సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోలేదు. ఈ అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయో.. సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియని సందిగ్ధత నెలకొంది. ఈ ఆలస్యం కారణంగా పెరుగుతున్న వడ్డీ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, పంపిణీదారులను నష్టాల నుంచి కాపాడాలని నిర్మాత ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తాజా నివేదికల ప్రకారం, ‘జననాయగన్’ పంపిణీదారులందరికీ వారు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని (రిఫండ్) కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. సినిమాకు ఎదురవుతున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయిన తర్వాత.. ఎలాంటి ముందస్తు థియేట్రికల్ బిజినెస్ ఒత్తిడి లేకుండా ఈ సినిమాను కేవీఎన్ సంస్థ సొంతంగానే పూర్తిగా విడుదల చేయాలని భావిస్తోంది. పంపిణీదారులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో హీరో దళపతి విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా ఆలస్యం కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడకూడదని, వారికి వెంటనే రిఫండ్స్ ఇచ్చేయాలని విజయ్ స్వయంగా ప్రొడక్షన్ హౌస్‌కు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. కథలో ఉన్న రాజకీయ అంశాల వల్ల ఈ ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు నడుస్తున్న తరుణంలో డిస్ట్రిబ్యూటర్లను సేవ్ చేయడానికి హీరో -నిర్మాత తీసుకున్న ఈ ముందడుగును కొందరు అభినందిస్తుండగా, సినిమా భవిష్యత్తు - ఓటీటీ రిలీజ్ ప్లాన్స్‌పై అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత ఇలాంటి ఊహించని మలుపు తిరగడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. భారీ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ నుండి డిస్ట్రిబ్యూటర్లకు ఎంత రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, విదేశీ పంపిణీదారుల పరిస్థితి ఏమిటి? చివరికి ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ బాట పడుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రిఫండ్ ప్రక్రియ పూర్తయితే `జననాయగన్` పంపిణీదారులు సేవ్ అయినట్టే. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ క్లియరెన్స్ ఎప్పుడు? అనేదానిపై నిర్మాణ సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమాని బాబి దర్శకత్వంలో కేవీఎన్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
