Begin typing your search above and press return to search.

జననాయగన్ రిలీజ్‌పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

ఎప్పుడో ఐదు నెలల కిందట సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా.. జననాయగన్. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రమిది.

By:  Garuda Media   |   31 May 2026 1:45 PM IST
జననాయగన్ రిలీజ్‌పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్
X

ఎప్పుడో ఐదు నెలల కిందట సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా.. జననాయగన్. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రమిది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఆ సినిమాకు మోక్షం కలగలేదు. ఐతే విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్ఠించిన నేపథ్యంలో ‘జననాయగన్’ విడుదల ఇక లాంఛనమే అనుకున్నారంతా.

కానీ విజయ్ సీఎం అయి నెల కావస్తున్నా ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇంతకుముందు అధికారంలో ఉన్న డీఎంకే కుట్ర పూరితంగా సినిమాను అడ్డుకుందని అనుకున్నా.. ఇప్పుడు ఆ అడ్డంకులేమీ లేవు కాబట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంలో ఉన్న ఇబ్బందేంటో అర్థం కావడం లేదు. జూన్ మూడో వారంలో రిలీజ్ అన్నది ఇప్పుడు మీడియాలో జరుగుతున్న ప్రచారం. కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రావడం లేదు.

ఇలాంటి టైంలో పా.రంజిత్, పాండిరాజ్ లాంటి కొందరు ప్రముఖ దర్శకులతో కలిసి ఒక తమిళ టీవీ ఛానెల్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ‘జననాయగన్’ దర్శకుడు హెచ్.వినోద్.. ఈ సినిమా విడుదల గురించి అడిగినపుడు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ‘జననాయగన్’ రిలీజ్ ఎప్పుడు అని అడిగితే.. అది తన చేతుల్లో లేని విషయం అంటూ నవ్వేశాడు హెచ్.వినోద్. అంతటితో ఆగకుండా ‘జననాయగన్’ విడుదల ఎందుకు ఆగిపోయిందో అసలు కారణం వెల్లడించడానికి తనకు ధైర్యం సరిపోదని వినోద్ వ్యాఖ్యానించాడు. అంతే కాక ఒకవేళ తాను ఆ కారణమేంటో వెల్లడించినా.. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి మీకు ధైర్యం సరిపోదని అతనన్నాడు.

దీంతో ‘జననాయగన్’ విడుదల ఆగిపోవడం వెనుక ఏం జరిగిందో వినోద్ సహా చిత్ర బృందం మొత్తానికి క్లియర్ కట్‌గా తెలుసని స్పష్టమవుతోంది. ఇప్పుడు విజయ్ సీఎం అయిన నేపథ్యంలో వినోద్ ఆ వివరాలు బయటపెట్టినా ఇబ్బందేమీ లేదు. మరెందుకు అతను వెనుకంజ వేస్తున్నాడో? మీడియా భయపడ్డా.. సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం జనానికి చేరడంలో ఏ ఇబ్బందీ లేదు. మరి ఎందుకు వినోద్ మౌనం వహిస్తున్నాడో? ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పటికీ ‘జననాగయన్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోవడంలో ఆంతర్యమేంటో తెలియట్లేదు.