జననాగయన్.. అసలెప్పుడు రిలీజవుతుంది?
ఐతే మార్చి 19న ‘జననాగయన్’ నిర్మాత సినిమా ‘టాక్సిక్’ షెడ్యూల్ అయి ఉండడంతో అప్పుడు విజయ్ మూవీని రిలీజ్ చేయడానికి స్కోప్ లేనట్లే.
By: Garuda Media | 21 Jan 2026 11:49 PM ISTఅంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈ సంక్రాంతికి తమిళనాడు బాక్సాఫీస్ షేకైపోయి ఉండాలి. అక్కడ కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. దానికి మామూలు హైప్ లేదు. తక్కువలో తక్కువ రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టేదని ఆ సినిమాపై అంచనాలున్నాయి విడుదలకు ముందు.
కానీ సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులతో అనూహ్యంగా సినిమా వాయిదా పడిపోయింది. జనవరి 9న రిలీజ్ సాధ్యపడకపోవడంతో 14న అయినా విజయ్ మూవీ థియేటర్లలోకి దిగుతుందని ఆశించారు అభిమానులు. కానీ అదీ జరగలేదు. రిపబ్లిక్ డే వీకెండ్ మీద కూడా ఆశలు పోయాయి. ఇంతకీ అసలెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని తలలు పట్టుకుంటున్నారు విజయ్ అభిమానులు. ఐతే ఈ విషయం ఒక పట్టాన తేలేలా లేదు.
‘జననాయగన్’ నిర్మాత ఏం చేసి అయినా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6 లేదా 13న రిలీజ్ చేయాలి. లేదంటే ఇంకో మూడు నెలల పాటు విడుదలకు అవకాశం లేనట్లే. ఫిబ్రవరి మూడో వారం నుంచి రంజాన్ మాసం మొదలు కానుండడంతో గల్ఫ్ కంట్రీస్‌లో కొత్త సినిమాలు విడుదల కావు. అక్కడ విజయ్‌కి పెద్ద మార్కెట్ ఉంది. మళ్లీ మార్చి మూడో వారం నుంచే సినిమాను రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఐతే మార్చి 19న ‘జననాగయన్’ నిర్మాత సినిమా ‘టాక్సిక్’ షెడ్యూల్ అయి ఉండడంతో అప్పుడు విజయ్ మూవీని రిలీజ్ చేయడానికి స్కోప్ లేనట్లే. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూడా మార్చిలోనే అమల్లోకి రాబోతోంది. ఇందులో రాజకీయ సన్నివేశాలు, డైలాగులపై ఇప్పటికే సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు తలెత్తాయి. ఎన్నికల కోడ్ మొదలైతే ఈ సినిమాపై మరిన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతాయి కాబట్టి ఈసీ దీనికి లైన్ క్లియర్ చేయకపోవచ్చు.
పైగా విజయ్ ఎన్నికల్లో బిజీ అవుతాడు కాబట్టి సినిమా వ్యవహారాన్ని పట్టించుకోవడం కష్టమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యాకే సినిమాను రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం ఎన్నికలకు ముందే రావాలని విజయ్, అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న లేదా 13న రిలీజ్ చేసుకోవడం బెటరని భావించి.. ఈలోపు సెన్సార్, కోర్టు సమస్యలన్నీ పరిష్కరించుకోవడం మీద నిర్మాత దృష్టిపెట్టారని తెలుస్తోంది.
