Begin typing your search above and press return to search.

సెన్సార్ వివాదం..మ‌ధ్య‌లో 'ధురంధ‌ర్‌ 2' చ‌ర్చ‌?

`జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ వివాదంపై వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో చిత్ర నిర్మాత `ధురంధ‌ర్ 2` సినిమాని ఉదాహ‌ర‌ణ చూపించార‌ట‌.

By:  Tupaki Entertainment Desk   |   21 Jan 2026 8:58 AM IST
సెన్సార్ వివాదం..మ‌ధ్య‌లో ధురంధ‌ర్‌ 2 చ‌ర్చ‌?
X

విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `జ‌న నాయ‌గ‌న్‌`. హెచ్‌. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన ఈ మూవీకి సెన్సార్ వారు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డింది. ఆ త‌రువాత సీబీఎఫ్‌సీ స‌భ్యులు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం, ప‌లు క‌ట్‌లు సూచించ‌డంతో దానికి మేక‌ర్స్ అంగీక‌రించి మ‌ళ్లీ సెన్సార్‌కి పంపించినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో టీమ్ మ‌ద్రాస్ హై కోర్టుని ఆశ్ర‌యించ‌డం, కోర్టు తీర్పుని సెన్సార్ విభాగం స‌వాల్ చేయ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు సినిమా రిలీజ్‌ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మూవీ రిలీజ్‌, సెన్సార్ స‌ర్టిఫికెట్ విష‌యంలో మంగ‌ళ‌వారం మ‌ద్రాస్ హైకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా సుధీర్ఘ వాద‌న‌లు జ‌ర‌గ్గా ఛీఫ్ జ‌స్టీస్ మ‌ణీంద్ర మోహ‌న్ శ్రీ‌వాత్స‌వ‌, జ‌స్టీస్ జి. శ్రీ అరుళ్ మురుగ‌న్ నేతృత్వంలోని డివిజ‌న్ బెంచ్ తీర్పును రిజ‌ర్వ్ చేసింది. గ‌తంలో `జ‌న నాయ‌గ‌న్‌` టీమ్‌కు ఊర‌ట‌నిస్తూ యు/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేయాల‌ని సింగిల్ జ‌డ్జ్ బెంచ్‌ సెన్సార్ బోర్డ్‌ని ఆదేశించ‌డం, ఆ తీర్పుని సీబీఎఫ్‌సీ స‌వాల్ చేయ‌డంతో దానిపై స్టే విధించ‌డం తెలిసిందే.

సీబీఎఫ్‌సీ డివిజ‌న్ బెంచ్‌కు వెళ్ల‌డంతో `జన నాయ‌గ‌న్‌` రిలీజ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. అయితే తాజాగా మంగ‌ళ‌వారం మ‌ద్రాస్ హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌ల్లో ఓ గ‌మ్మ‌త్తైన విష‌యం జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. `జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ వివాదంపై వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో చిత్ర నిర్మాత `ధురంధ‌ర్ 2` సినిమాని ఉదాహ‌ర‌ణ చూపించార‌ట‌. వెంట‌నే ఈ అంశాన్ని లేవ‌నెత్తిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌రుపు న్యాయ‌వాది స‌తీష్ ప‌రాశ‌ర‌న్ `ధురంధ‌ర్ 2` మూవీని ప్ర‌స్తావిస్తూ సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీకి ముందే సినిమా రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించ‌డం చాలా కాలంగా ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని వాదించార‌ట‌.

ఈ సంద‌ర్భంగా ఛీఫ్ జ‌స్టీస్ మ‌ణీంద్ర మోహ‌న్ శ్రీ‌వాత్స‌వ‌, జ‌స్టీస్ జి. శ్రీ అరుళ్ మురుగ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం సెన్సార్ సర్టిఫికెట్ రాకుండానే ఇలా సినిమాల రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తిం చేసింద‌ట‌. అయితే కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌రుపు న్యాయ‌వాది స‌తీష్ ప‌రాశ‌ర‌న్ మాత్రం మా సినిమా రిలీజ్‌కు ఇప్ప‌టికే 22 దేశాల్లో అనుమ‌తి ల‌భించింద‌ని కోర్టుకు స్ప‌ష్టం చేశార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌న‌ర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ రిలీజ్ విష‌యంలో డిసెంబ‌ర్ 31 లోగా స్ప‌ష్ట‌త రాక‌పోతే స‌ద‌రు నిర్మాణ సంస్థ‌పై కేసు వేస్తాన‌ని చెప్పింద‌ని ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశార‌ట‌.

తాజా విచార‌ణ నేప‌థ్యంలో `జ‌న నాయ‌గ‌న్‌` ఇప్ప‌ట్లో రిలీజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. సెన్సార్ వివాదం కొలిక్కి రాక‌పోతే విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌` మెడ‌కు మ‌రో కేసు చుట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని, ఓటీటీ పార్ట్‌న‌ర్ అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా రంగంలోకి దిగి కేసు వేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అదే జ‌రిగితే విజ‌య్ ప్రొడ్యూస‌ర్ నిండా మున‌గ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ స‌ర్వత్రా వినిపిస్తోంది. మ‌రి ఈ వివాదానికి తెర ప‌డేది ఎన్న‌డో.. విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌` థియేట‌ర్ల‌కు వ‌చ్చేది ఎన్న‌డో.