Begin typing your search above and press return to search.

అంత పెద్ద హీరో అలాంటి త‌ప్పు చేస్తాడా?

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చిట్ట చివ‌రి చిత్రం `జ‌న నాయ‌గ‌న్` సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   4 Jan 2026 12:48 PM IST
అంత పెద్ద హీరో అలాంటి త‌ప్పు చేస్తాడా?
X

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చిట్ట చివ‌రి చిత్రం `జ‌న నాయ‌గ‌న్` సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ వెబ్ లో సునామీ సృష్టిస్తోంది. విజ‌య్ మార్క్ యాక్ష‌న్, పొలిటిక‌ల్ అంశాల‌తో ట్రైల‌ర్ ర‌క్తి క‌ట్టించింది. ఎన్బీకే- అనీల్ రావిపూడి ల‌ `భ‌గ‌వంత్ కేస‌రి`కి ఇది రీమేక్ అంటూ ప్ర‌చారం సాగిపోతోంది.

ఇదిలా ఉండ‌గానే, ఈ ట్రైల‌ర్ ఊహించ‌ని రీతిలో ఒక వివాదాన్ని ఎదుర్కొంటోంది. జన నాయగన్ ట్రైలర్‌లో ఒక AI వాటర్‌మార్క్ కనిపించడంతో అది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత పెనుదుమారం రేపుతోంది.

అంత పెద్ద స్టార్ హీరో న‌టించిన సినిమా ట్రైల‌ర్ క‌ట్ లో అంత అజాగ్ర‌త్త‌గా ఎలా ఉంటారు? అంటూ ట్రైల‌ర్ ఎడిట‌ర్ ని నిల‌దీసే ప్ర‌య‌త్నం సాగుతోంది. ఈ ట్రైల‌ర్ లో కొన్ని సెక‌న్ల పాటు క‌నిపించే ఏఐ వాట‌ర్ మార్క్ ని ఎలా మ‌ర్చిపోయారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన ఒక యాప్ గురించిన ప్ర‌చారం ఇద‌ని కూడా కొంద‌రు గుర్తించారు.

ట్రైలర్ ఎడిటర్ ఒక సన్నివేశంలో AI వాటర్‌మార్క్‌ను తొలగించడం మర్చిపోయాడా? లేక ఉద్ధేశ‌పూర్వ‌కంగా కావాల‌నే దానిని అలా వ‌దిలేసారా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి ఇప్ప‌టికే ఇది ప్ర‌జ‌ల్లో బాగా పాపుల‌రైన‌ ఏఐ యాప్ గ‌నుక, దీనికి ద‌ళ‌ప‌తి తో ప్ర‌చారం అవ‌స‌ర‌మా? అని కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక క్రేజీ ట్రైలర్‌లో ఏఐ చిత్రాలా? అంటూ కొంద‌రు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ట్రైల‌ర్ లో విజయ్ ప్రతీకారం తీర్చుకునే పోలీసు అధికారిగా కనిపించాడు. ట్రైలర్ ఆరంభ‌ సన్నివేశంలో ఒక వ్యక్తి భారీ గ‌న్ ని సిద్ధం చేస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత వచ్చిన ఒక చిన్న సన్నివేశంలో గూ*ల్ జె*ని లోగో కనిపించిందని, ట్విట్టర్‌లోని పలు ఖాతాలు స్క్రీన్ షాట్‌ల‌ను షేర్ చేయ‌డంతో అది దుమారంగా మారింది. ప్ర‌స్తుతం చిత్ర‌నిర్మాత‌లు, విజయ్ కూడా తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. చాలా మంది సినిమాలలో కృత్రిమ మేధ‌స్సు వాడకాన్ని కళారూపానికి `అవమానం` అని కామెంట్ చేస్తున్నారు. రీమేక్ సినిమాకు కూడా జెమిని ఏఐ వాడుతున్నారా? అని ఒక నెటిజ‌న్ ఎద్దేవా చేసారు. జననాయగన్ టీమ్ ఇంతటి అనుభవం లేని తప్పు ఎలా చేస్తుంది? ఎడిటర్ ఎవరు? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. ``400 కోట్ల బడ్జెట్, కానీ ఇదేంటి?`` అని ఒక‌రు ప్ర‌శ్నించారు.

ఇది ఆమోద యోగ్యం కాదు. సినిమాలలో AIకి చోటు లేదు.. ప్రధాన స్రవంతి మీడియాలో దీనిని ఉపయోగించే వారిని ప్రశ్నించడం ముఖ్యం అని ఒక‌రు నిల‌దీసారు. విజ‌య్ చివరి సినిమా కదా.. అద్భుతంగా ఉండాలి కదా! అని మ‌రొక‌రు అన్నారు.