విజయ్ చివరి మూవీ.. రావిపూడి ప్లాన్ సరైనదేనా?
జననాయగన్ హిట్ అయితే ఆ క్రెడిట్‌లో రావిపూడి పేరు కూడా ఉండేదనే భావన వ్యక్తమవుతోంది. అందుకే మంచి ఛాన్స్ మిస్ అయ్యిందా? అనే ప్రశ్నలు లేవుతున్నాయి.
By: M Prashanth | 5 May 2026 2:00 PM ISTటాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ లకు అడ్రెస్ గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ సినిమాను ఆయన రిజెక్ట్ చేయడం తప్పా? లేక కెరీర్ పరంగా సరైన నిర్ణయమా? అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. దీంతో నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన విజయ్.. పోలింగ్ కు ముందే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. జన నాయగన్ తన చివరి సినిమా అని చెప్పారు. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఆ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల అవ్వలేదు. ఇప్పుడు విజయ్ విజయం సాధించడంతో అందరి దృష్టి జన నాయగన్ మూవీపైనే పడింది.
దీంతో ఆ ప్రాజెక్ట్ కు భారీ ప్రాధాన్యం ఏర్పడింది. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడికి ఆ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావడం, కానీ ఆయన దాన్ని వదులుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన ఆ సినిమాకు తన భగవంత్ కేసరి సోల్ ఉందని స్వయంగా చెప్పడం మరింత చర్చకు దారితీసింది. భగవంత్ కేసరి మూవీని బాలకృష్ణతో రావిపూడి తెరకెక్కించిన భారీ విజయాన్ని అందుకున్న చిత్రం.
ఆ సినిమాలోని ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే స్టోర్ లైన్ తోనే జన నాయగన్ రూపొందిందని ప్రచారం జరిగింది. అయితే ఇది కంప్లీట్ రీమేక్ కాదని, కేవలం సోల్ మాత్రమే తీసుకున్నారని రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తనకు రీమేక్ లపై పెద్దగా ఆసక్తి లేదని, ఇప్పటికే చేసిన కథను మళ్లీ మరో లాంగ్వేజ్ లో చేయడం కంటే కొత్తదనం చూపించడం ఇష్టమని చెప్పారు.
అందుకే జననాయగన్ ఆఫర్ వచ్చినప్పటికీ, సింపుల్ గా రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో తమిళ దర్శకుడు హెచ్. వినోథ్ ఆ ప్రాజెక్ట్ ను చేపట్టి, తమిళ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారని తెలుస్తోంది. అయితే చివరి సినిమాలో భాగమైతే.. రావిపూడి పేరు పాన్ ఇండియా లెవెల్ లో మరింతగా మార్మోగేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
జననాయగన్ హిట్ అయితే ఆ క్రెడిట్‌లో రావిపూడి పేరు కూడా ఉండేదనే భావన వ్యక్తమవుతోంది. అందుకే మంచి ఛాన్స్ మిస్ అయ్యిందా? అనే ప్రశ్నలు లేవుతున్నాయి. కానీ మరోవైపు చూస్తే, రావిపూడి తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రాక్టికల్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అదే సమయంలో తన స్టైల్ కు తగ్గ కొత్త కథతో మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు.
ఆ ప్రాజెక్ట్ ఆయనకు మరొక బ్లాక్ బస్టర్ ను తెచ్చిపెట్టింది. దీంతో రిస్క్ తీసుకోకుండా, తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడం వల్ల విజయాన్ని సాధించగలిగారని చెప్పాలి. మొత్తానికి చూస్తే జన నాయగన్ ను వదిలేయడం వల్ల రావిపూడి పెద్దగా నష్టపోయారని చెప్పడం కష్టమే. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే వేరే స్థాయిలో గుర్తింపు వచ్చుండొచ్చు. కానీ ఆయన నిర్ణయం కూడా విజయాన్ని అందించింది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఏ కథ ఎవరికైతే రాసి ఉంటుందో, అది వాళ్లకే దక్కుతుందనే మాట మళ్లీ నిజమైందని చెప్పాలి.
