విజయ్ కే ఎందుకు?
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్.
By: Madhu Reddy | 12 Jan 2026 7:35 PM ISTకోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా సెన్సార్ రాకపోవడం వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది.. విజయ్ దళపతి హీరోగా వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పైగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంతు కేసరి సినిమాకు రీమేక్.
ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైజ్డ్ కమిటీకి నివేదించడంతో నిర్మాత మొదట హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు.. సింగిల్ జడ్జి బెంచ్ సినిమాకి ముందుగా ఇచ్చిన యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వాలి అని సెన్సార్ బోర్డ్ ను ఆదేశించింది. అయితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు అప్పీలు చేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే సెన్సార్ బోర్డు వాదనలను పరిగణలోకి తీసుకున్న డివిజన్ బెంచ్.. తదుపరి విచారణ జరిగే వరకు సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లుతుందని.. సెన్సార్ బోర్డు ఉద్దేశపూర్వకంగానే సెన్సార్ ఇవ్వడంలో జాప్యం చేస్తోందని.. కెవిన్ ప్రొడక్షన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక హైకోర్టు డివిజన్ బెంజ్ ఇచ్చిన స్టే ను తొలగించి, సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలి అని తమ పిటీషన్ లో పేర్కొన్నారు నిర్మాత. అంతేకాదు వెంటనే విచారణ జరిపి తమ సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు అని బాధపడుతున్న సమయంలో విజయ్ కి మరో షాక్ తగిలిందని చెప్పాలి.
విజయ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా తన టీవీకే పార్టీని స్థాపించి , ఈసారి ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో బహిరంగ సభలో ఏర్పాటు చేస్తూ ప్రసంగిస్తున్నారు. అయితే గత ఏడాది తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జరిగిన ఘోర తొక్కిసలాటలో సుమారుగా 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటకు సంబంధించి కేసు నడుస్తుండగా.. ఈరోజు న్యూఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోని సభ నిర్వహణలో లోపాలు, భద్రతా వైఫల్యాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ విజయ్ కి నోటీసులు జారీ చేయడంతో.. ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో సభకు తీసుకున్న అనుమతులు, జన సమీకరణ అంచనాలు ముఖ్యంగా అక్కడ కల్పించిన భద్రతా చర్యల గురించి విజయ్ ని అధికారులు ప్రశ్నించారట. ఇకపోతే విచారణ తర్వాత బయటకు వచ్చిన విజయ్ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.
మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకవైపు తన సినిమాకు సెన్సార్ రాకుండా జాప్యం చేయడం, ఇటు సీబీఐ ఎదుట ఆయన విచారణకు హాజరవడం అన్నీ కూడా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కి ఎందుకు ఇలా జరుగుతోంది. విజయ్ ను తొక్కేయడానికి కొంతమంది చూస్తున్నారేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ విషయాలు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
