ఎటూ తేల్చుకోలేకపోతున్న జన నాయగన్
సెన్సార్ జాప్యం కారణంగా జన నాయగన్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది.
By: Sravani Lakshmi Srungarapu | 19 Jan 2026 7:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలుండటంతో పాటూ విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న ఆఖరి చిత్రంగా దీనిపై మంచి బజ్ నెలకొంది. వాస్తవానికి జన నాయగన్ జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవాల్సింది. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
జననాయగన్ రిలీజ్ పై నెలకొన్న అనిశ్చితి
సెన్సార్ జాప్యం కారణంగా జన నాయగన్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. అయితే సినిమా రిలీజ్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం మూడు స్లాట్ లు మాత్రమే మిగిలాయి. జనవరి30, ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13 మూడింటిలో ఏదొక రోజున జన నాయగన్ రిలీజవాలి లేదంటే మళ్లీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కుదరదు, జూన్ తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.
మేకర్స్ అభ్యర్థనను సుప్రీం కోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ విషయంలో మరింత అనిశ్చితి పెరిగింది. ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టులో కొనసాగించాలని జడ్జి చిత్ర నిర్మాతలకు ఆదేశించడంతో, చిత్ర క్లియరెన్స్ పై ఆశలన్నీ నిలిచిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం జన నాయగన్ ఫిబ్రవరిలోనే రిలీజవుతుందని చెప్తున్నారు.
దీపావళికి రిలీజ్ చేయమని సలహాలు
ఈ నెలాఖరులోగా సర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని అంటున్నారు కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉంటే విజయ్ ఫ్యాన్స్ లో కొందరు మాత్రం విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జన నాయగన్ కు దీపావళి సీజన్ అయితే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పండగ టైమ్ లో రిలీజ్ చేస్తే జననాయగన్ కు మంచి గుర్తింపు దక్కడంతో పాటూ దాని ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
ఓటీటీలో వస్తుందని ట్రోల్స్
ఇదంతా కాదని కొందరు విమర్శకులు మాత్రం జన నాయగన్ సినిమా ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి అసలెలాంటి ఆధారాలు లేకపోయినా ట్రోలర్స్ మాత్రం తమకు నచ్చింది ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. దళపతి ఆఖరి సినిమాగా వస్తున్న జన నాయగన్ అతనికి మంచి అనుభూతుల్ని మిగులుస్తుందనుకుంటే, పరిస్థితులు మాత్రం ఆయనకు వేరే అనుభూతుల్ని మిగులుస్తున్నాయి. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ లో జననాయగన్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
