Begin typing your search above and press return to search.

జననాయగ‌న్ వెనుక భారీ ప్లాన్? నిర్మాత షాకింగ్ రివీల్

కరోనా తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న తాను, సాధారణ సినిమాతో కాకుండా భారీ స్థాయి ప్రాజెక్ట్‌తోనే ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 July 2026 10:27 PM IST
జననాయగ‌న్ వెనుక భారీ ప్లాన్? నిర్మాత షాకింగ్ రివీల్
X

కోలీవుడ్ స్టార్ హీరో, త‌మిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ సినీ జ‌ర్నీకి ముగింపు పలకబోతున్న సినిమా జన నాయగ‌న్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ‌, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నటుడిగా విజయ్ చివరి సినిమా కావడంతో పాటు, పాలిటిక్స్ లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు ఫ్యాన్స్ కు అందించే చివరి కానుకగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. జూలై 23న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి నిర్మాత వెంక‌ట్ కె. నారాయ‌ణ‌ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కరోనా తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న తాను, సాధారణ సినిమాతో కాకుండా భారీ స్థాయి ప్రాజెక్ట్‌తోనే ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అదే ఆలోచనతో విజయ్‌ను సంప్రదించగా, ఇద్దరి మధ్య జరిగిన డిస్క‌ష‌న్స్ తర్వాత ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాను రూపొందించాలనే టార్గెట్ తో జననాయగ‌న్ కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

మొదట అనౌన్స్ చేసిన టైమ్‌కే సినిమా రిలీజ‌వాల్సి ఉన్నప్పటికీ, సెన్సార్‌కు సంబంధించిన ప్రక్రియల కారణంగా రిలీజ్ దాదాపు ఏడు నెలలు లేటైంద‌ని కేవీఎన్ వివరించారు. అయితే ఆ గ్యాప్ ను బలహీనతగా కాకుండా, సినిమాను మరింత మెరుగుపరచుకునే అవకాశంగా తీసుకున్నామని చెప్పారు. రిలీజ్ విషయంలోనూ భారీ ప్రణాళికలు రూపొందించిన నిర్మాత, ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్లలో జ‌న నాయ‌గ‌న్‌ను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇది విజయ్ కెరీర్‌లోనే భారీ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ సినిమా కోసం భగవంత్ కేసరి కథను ఆధారంగా తీసుకోవడం విజయ్ సూచనతోనే జరిగిందని కేవీఎన్ చెప్పారు. అయితే భ‌గ‌వంత్ కేస‌రి క‌థ‌ను యథాతథంగా కాకుండా, తమిళ ఆడియ‌న్స్ అభిరుచికి తగ్గట్టు కొత్త అనుభూతిని ఇచ్చేలా మార్పులు చేసి రూపొందించామని పేర్కొన్నారు. ఈ జ‌ర్నీలో ఎదురైన ప్రతి ఛాలెంజ్ తమకు విలువైన అనుభవాన్ని అందించిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడిన కేవీఎన్, ఆయన క్రమశిక్షణ, డెడికేష‌న్, పనిపట్ల నిబద్ధత అంద‌రికీ ఎప్పటికప్పుడు స్పూర్తిగా నిలిచాయని చెప్పారు. అలాగే డైరెక్ట‌ర్ హెచ్. వినోద్ మహిళా సాధికారతతో పాటు సమాజంలో అవసరమైన రాజకీయ మార్పును ప్రతిబింబించే అంశాలను కథలో బలంగా మిళితం చేశారని వివరించారు.

ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్‌ను మరోసారి వెండితెరపై చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతినిస్తుందని, అదే ఈ సినిమాకు అతిపెద్ద ఎట్రాక్ష‌న్ గా మారుతుందని కేవీఎన్ విశ్వాసం వ్యక్తం చేశారు. పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే నమ్మకాన్ని ఆయ‌న వ్యక్తం చేశారు.