అప్పుడు కాజల్.. ఇప్పుడు పూజ.. సేమ్ సీన్ రిపీట్?
దీంతో అభిమానులు అప్పుడు కాజల్.. ఇప్పుడు పూజ.. సేమ్ సీన్ రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
By: M Prashanth | 22 July 2026 11:31 AM ISTకొందరు హీరోయిన్లకు స్టార్ హీరోల సినిమాలు పెద్ద అవకాశాలుగా మారితే, మరికొందరికి అదే మూవీలు నిరాశను మిగులుస్తుంటాయి. ఇప్పుడు జననాయగన్ విడుదలకు ముందే అలాంటి చర్చే సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు భగవంత్ కేసరి తెలుగు వెర్షన్ లో కాజల్ అగర్వాల్ పాత్ర విషయంలో జరిగిన చర్చ.. ఇప్పుడు పూజా హెగ్డే విషయంలోనూ వినిపిస్తోంది. దీంతో అభిమానులు అప్పుడు కాజల్.. ఇప్పుడు పూజ.. సేమ్ సీన్ రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ తో కలిసి పూజా హెగ్డే నటిస్తుండటంతో ఆమె పాత్రపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే విడుదలకు ముందే దర్శకుడు హెచ్. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో పూజా హెగ్డే జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని, కానీ ఆమె రోల్ కు ఆశించినంత ఇంపార్టెన్స్ ఉండదని ఆయన వెల్లడించారు. మొదట కథ రాసినప్పుడు పూజా పాత్రను మరింత డెప్త్ గా ఉంచాలని అనుకున్నప్పటికీ, సినిమా రన్ టైమ్ కారణంగా కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్, పూజా హెగ్డే మధ్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదని వినోద్ స్పష్టం చేశారు. సాధారణంగా స్టార్ హీరో- హీరోయిన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు పాటలు, రొమాన్స్, పలు కీలక సన్నివేశాలు ఆశిస్తారు. కానీ జననాయగన్ లో మాత్రం పూజా పాత్ర కథకు అవసరమైనంత వరకే పరిమితమైనట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో చాలా మందికి భగవంత్ కేసరి సినిమా గుర్తుకు వస్తోంది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ నటించినప్పటికీ, ఆమె రోల్ కు తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కథ మొత్తం బాలకృష్ణ, శ్రీలీల పాత్రల చుట్టూ తిరగడంతో కాజల్ పాత్ర పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు పూజా హెగ్డే విషయంలో కూడా అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ఇటీవల పూజా హెగ్డేకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. దీంతో విజయ్ చివరి చిత్రంలో ఆమె నటించడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
ఆ సినిమా ఆమె కెరీర్‌కు మళ్లీ మంచి ఊపు తీసుకొస్తుందని చాలామంది భావించారు. కానీ విడుదలకు ముందే దర్శకుడు కామెంట్స్ చూస్తే, పూజా స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు తక్కువ రన్ టైమ్ ఉన్న పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అందుకే పూజ రోల్ రన్ టైమ్ కంటే, కథలో ఆమె ఎఫెక్ట్ ఎంత అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి జననాయగన్ లో పూజా హెగ్డే ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
