అక్కడ బుకింగ్స్ జోరు, ఇక్కడ బేజారు
కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'జన నాయగన్' సినిమా విడుదలకు సిద్ధం అయింది.
By: Ramesh Palla | 21 July 2026 11:42 AM ISTకోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'జన నాయగన్' సినిమా విడుదలకు సిద్ధం అయింది. గత ఆరు నెలలుగా అదుగో, ఇదుగో అంటూ ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. మొదట సెన్సార్ ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. తర్వాత విజయ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమాను విడుదల చేసేందుకు వీలు పడలేదు. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అనే విషయం తెల్సిందే. దాంతో సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్‌కి రెడీ అయింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రావడమే ఆలస్యం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఇక సినిమాను ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా ఆటుపోట్లను ఎదుర్కొని విడుదలకు సిద్ధం అయింది.
విజయ్ జన నాయగన్ మూవీ...
తమిళనాడు రాజకీయాల వల్ల జన నాయగన్ బలి అయ్యిందని ఆ మధ్య జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. విజయ్ రాజకీయాల్లో ఉండటం వల్ల ఆయన ప్రత్యర్థులు సినిమాను విడుదల కాకుండా ప్రయత్నించారు అనేది అందరికీ తెలిసిందే. అసలు సినిమాను అప్పటి ప్రభుత్వం ఎందుకు విడుదల అడ్డుకుందా అని చాలా మందిలో ఆసక్తి ఉంది. అందుకే ఇప్పుడు విడుదల కాబోతున్న నేపథ్యంలో చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టేందుకు రెడీ అవుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయిన గంటల్లోనే లక్షల కొద్ది టికెట్లు బుక్ కావడంను బట్టి చూస్తే జన నాయగన్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోనే బిగ్గెస్ట్ స్టార్, అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న సూపర్ స్టార్ విజయ్ నటించిన చివరి మూవీ కావడంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రేక్షకులు సైతం అడ్వాన్స్ బుకింగ్‌కి రెడీ అయ్యారని టాక్.
బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీకి రీమేక్...
కోలీవుడ్ ప్రేక్షకులు జననాయగన్ సినిమాను చూసేందుకు ఉవ్విల్లూరుతూ ఉంటే హిందీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హిందీలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ విజయ్‌కి అక్కడ పెద్దగా క్రేజ్ లేదు, పైగా ప్రమోషన్ అసలు చేయలేదు. దాంతో సినిమాకు అక్కడ నామమాత్రంగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయింది. కానీ ఇప్పటి వరకు పెద్దగా జోరు, జోష్ కనిపించడం లేదు. విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది, పైగా ఇప్పుడు సీఎం అయ్యాడు కనుక ఆయన సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. అందుకు కారణం ఇది రీమేక్ అనే విషయం ముందే రివీల్ అయింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు జన నాయగన్ రీమేక్ అనే విషయం అందరికీ తెలిసింది.
జన నాయగన్ అడ్వాన్స్ సేల్ రికార్డ్..
తెలుగు సినిమాకు రీమేక్‌గా రూపొందిన జన నాయగన్‌ను మళ్లీ తెలుగులో విడుదల చేయాలని అనుకోవడం పెద్ద తప్పు అనే విషయం ను చాలా మంది ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అయినా కూడా విజయ్ ఇప్పుడు సీఎం కనుక ఆయనకు ఉన్న క్రేజ్ తో జన నాయగన్‌ను చూస్తారని నిర్మాతలు అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలను చూసే పరిస్థితి లేదని, పైగా ఇంతకు ముందు చూసిన సినిమాను మళ్లీ ఏం చూస్తాం అనుకున్నారో ఏమో కానీ తెలుగు ప్రేక్షకులు జన నాయగన్ అడ్వాన్స్ బుకింగ్‌ను పట్టించుకోవడం లేదు. దాంతో తమిళనాడులో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరు కనిపిస్తూ ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ మినిమం నమోదు కాలేదు.
కొన్ని స్క్రీన్స్‌లో అసలు బుకింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, నార్త్ ఇండియాలో కలెక్షన్స్ రాకున్నా కేవలం తమిళనాడు వరకే అయినా జన నాయగన్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. తమిళ ప్రేక్షకులు సెంటిమెంట్‌గా జన నాయగన్‌ను భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే తమిళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశాలు లేక పోలేదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
