సమాజంలో మహిళలకు రక్షణ ఎక్కడ?
ఇటీవల బీహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన మహిళపై వేధింపుల దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యవక్తమైంది.
By: Srikanth Kontham | 22 Sept 2026 1:35 PM ISTఇటీవల బీహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన మహిళపై వేధింపుల దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యవక్తమైంది. సోషల్ మీడియా వేదికగా సంఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు నేరస్థుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహిళల భద్రతపై మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అకృత్యంపై భారత సైన్యంలో మాజీ అధికారిణి, బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ స్పందించారు. ఇలాంటి ఘోరాలు సమాజానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశంలో మహిళల రక్షణకు సంబంధించిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పటానీ ఈ ఘటన తన మనస్సును ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి తక్షణమే న్యాయం జరగాలని, దోషులకు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని ఖుష్బూ పటానీ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
నేరస్థులకు తగిన శిక్షలు పడనంత కాలం ఇలాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా చట్టపరమైన చర్యలు ఉదాహరణగా నిలవాలన్నారు. ఖుష్బూ పటానీతో పాటు మరో నటి అయేషా ఖాన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధితులకు అండగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ సంఘటన దేశంలో మహిళల భద్రతకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలు, వాటి అమలు తీరుపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది. వేగవంతమైన విచారణ, కఠినమైన శిక్షలతో పాటు సమాజంలో మహిళల పట్ల చూసే దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. శాంతిభద్రతల నిర్వహణలో పారదర్శకత, వేగవంతమైన న్యాయ ప్రక్రియ మాత్రమే ఇలాంటి నేరాలను అరికట్టగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖుష్బూ పటానీ, అయేషా ఖాన్ బహిరంగంగా గళమెత్తడం తో బాధితురాలికి న్యాయం జరిగేందుకు అధికారులపై ఒత్తిడి పెరిగింది. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా ప్రశ్నించడమే సరైన మార్గమని ఈ ఘటన పున రుద్ఘాటిస్తోంది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పునరు ద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ,పోలీసు యంత్రాంగంపై ఉంది.
