చెడు 3D మెదడును గందరగోళానికి గురి చేస్తుంది: కామెరూన్
ఏదైనా 3డి సినిమా చూసేప్పుడు మానసిక అలసట, కళ్లు- మెదడుపై ఒత్తిడి, గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తాయా? అయితే అలా జరిగితే, అది కచ్ఛితంగా చెడ్డ 3డి.
By: Sivaji Kontham | 21 Dec 2025 11:43 PM ISTఏదైనా 3డి సినిమా చూసేప్పుడు మానసిక అలసట, కళ్లు- మెదడుపై ఒత్తిడి, గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తాయా? అయితే అలా జరిగితే, అది కచ్ఛితంగా చెడ్డ 3డి. అలాంటి 3డి విజువల్స్ ని చూడకూడదు. అలా కాకుండా కంటిపైనా మెదడుపైనా ఒత్తిడిని పెంచని సమతుల్యత ఉన్న సహజసిద్ధమైన 3డి విజువల్ ని వీక్షించాలని, దానికోసం తాను చాలా అధ్యయనం చేసానని చెబుతున్నారు లెజెండరీ దర్శకనిర్మాత జేమ్స్ కామెరూన్. ప్రపంచవిఖ్యాత దిగ్గజ దర్శకుడు కామెరూన్ 70ప్లస్ వయసులోను అద్భుతాలు చేస్తున్నాడు. అతడు రూపొందించిన అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) భారతదేశంలోను విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ వసూళ్ల పరంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో స్పీడ్ కనిపిస్తోందని విశ్లేషణ. ఈ చిత్రంపై నెగెటివ్ సమీక్షల ప్రభావం పడలేదు. కేవలం రెండు రోజుల్లో 45కోట్లు వసూలు చేసి ఇండియాలో 100కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది.
ఈ సమయంలో 3డి విజువల్ మాయాజాలం గురించి కామెరూన్ చెప్పిన కొత్త విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాను సహజసిద్ధంగా సినిమాలో లీనమయ్యేలా సహకరించే మంచి 3డి విజువల్స్ కోసం పరిశోధించానని కామెరూన్ తెలిపారు. అలా కాకుండా కంటిపై ఒత్తిడికి గురి చేసి మెదడును గందరగోళంలోకి నెట్టే విజువల్స్ ని చూపించనని అన్నారు. దీనికోసం తాను చాలా పరిశోధించానని తెలిపారు.
3Dలో సినిమా చూస్తున్నప్పుడు తలనొప్పి అసౌకర్యం కలిగించే ప్రమాదాన్ని తగ్గించడానికి తాను నిజమైన న్యూరోసైన్స్‌ను అధ్యయనం చేశానని లెజెండరీ ఫిలింమేకర్ కామెరూన్ వెల్లడించాడు. 3డి చిత్రంలో డెప్త్, దృష్టి.. కదలిక అసహజంగా లేదా పేలవంగా అనిపించనప్పుడు మనిషి మెదడు ఇబ్బంది పడుతుందని ఆయన వివరించారు. చెడు 3డి మెదడును గందరగోళానికి గురి చేస్తుందని కామెరూన్ తెలిపారు. విరుద్ధమైన దృశ్య సంకేతాలను ప్రాసెస్ చేయాలని బలవంతం చేస్తే అది మానసిక అలసటకు దారి తీస్తుందని అది చివరికి తలనొప్పిగా మారుతుందని కూడా తెలిపారు. ప్రేక్షకులు ఎక్కువ సేపు సౌకర్యంగా 3డి విజువల్స్ ని చూడాలంటే వాస్తవ ప్రపంచ అవగాహనతో సినిమాని తెరకెక్కించాలని అన్నారు.
అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ.. శుద్ధి చేసిన కెమెరా సిస్టమ్స్ తో కలిసి పని చేస్తే 3డిని ప్రేక్షకులు లీనమయ్యేలా సహజంగా అనిపించేలా తెరకెక్కించగలమని కామెరూన్ చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ -3డి వంటి అధునాతన సాంకేతిక విధానాలపై పని చేసేప్పుడు న్యూరో సైన్స్ (మెదడు సంబంధ సైన్స్)ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను కామెరూన్ ఇలా గుర్తు చేయడం నిజంగా ఆసక్తికరం.
