ఆ రెండు కలవడం 'విపత్తు' కి సంకేతం...!
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ విషయమై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 26 Nov 2025 10:00 PM ISTఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ విషయమై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉండి, వరల్డ్ టాప్ ఓటీటీగా చలామని అవుతున్న నెట్‌ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లడం కోసం, ప్రేక్షకులకు కంటెంట్‌ను మరింతగా అందించడం కోసం, తమ బిజినెస్‌ను పెంచుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్‌ను, వారికి సంబంధించిన కంటెంట్, అంతే కాకుండా వారికి సంబంధించిన డిజిటల్ కంటెంట్‌ను గంపగుత్తగా కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అత్యంత భారీ ఓటీటీ డీల్‌గా అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఏ క్షణంలో అయినా కొనుగోలు జరగవచ్చు అంటున్నారు.
జేమ్స్ కామెరూన్ ఆగ్రహం...
ఈ సమయంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించాడు. నెట్‌ఫ్లిక్స్ వారు వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేయడంను కామెరూన్ వ్యతిరేకిస్తున్నాడు. వార్నర్ బ్రదర్స్‌ను ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం వల్ల ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని, అదో పెద్ద విపత్తుకు సంకేతంగా తాను భావిస్తున్నాను అంటూ కామెరూన్ చెప్పుకొచ్చాడు. వార్నర్ బ్రదర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం ద్వారా చాలా మార్పులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. థియేట్రికల్ స్క్రీనింగ్ విషయంలో తాము మరింత అడ్వాన్స్‌గా, తమ మార్కెట్‌ను విస్తరిస్తామని నెట్‌ఫ్లిక్స్ వారు అంటున్నారు. కానీ అలా సాధ్యం కాకపోవచ్చని కామెరూన్ అన్నారు. ఖచ్చితంగా వార్నర్ బ్రదర్స్ తరహాలో సినిమాలను థియేట్రికల్ రిలీజ్‌కి నెట్‌ఫ్లిక్స్ ప్రాధాన్యత ఇవ్వక పోవచ్చు అనేది ఆయన అనుమానం.
వార్నర్ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం...
థియేటర్‌లో వారం రెండు వారాల పాటు సినిమాను ఆడించి, ఆ వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇచ్చేయనున్నారు. అయితే థియేట్రికల్ రన్ అనేది కేవలం అవార్డ్‌ల కోసం అని, అవార్డు పోటీలకు అర్హత సాధించాలంటే థియేట్రికల్ రన్ ఉండాలి. అందుకే నెట్‌ఫ్లిక్స్ వారం లేదా రెండు వారాల పాటు తమ సినిమాను స్క్రీనింగ్‌కు ఉంచుతుందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. ఆస్కార్ వంటి అవార్డ్‌లకు అర్హత సాధించడం కోసమే సినిమాలను థియేటర్ల ద్వారా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేస్తుందని అన్నాడు. అంతే కాకుండా ఇలా చేయడం ద్వారా థియేటర్‌ల వ్యవస్థ దెబ్బ తింటుంది. థియేట్రికల్ సినిమాలు చనిపోయే ప్రమాదం కూడా ఉందని, ముందు ముందు థియేట్రికల్ విషయంలోనే అనుమానాలు వ్యక్తం అవుతాయని అన్నాడు.
హాలీవుడ్ సినిమాలు..
వార్నర్ బ్రదర్స్‌తో పోల్చితే మేము ఇంకా ఎక్కువ థియేటర్ల ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నెట్‌ఫ్లిక్స్ అంటోంది. కానీ ఇది కేవలం ఒక ఎర మాత్రమే అని జేమ్స్ కామెరూన్ వంటి ప్రముఖులు అంటున్నారు. హాలీవుడ్ సినిమాలు మినిమంగా 2000 థియేటర్‌లలో స్క్రీనింగ్ కావాల్సిన అవసరం ఉంది. అది ఒక్క వారంకు పరిమితం కాకుండా లాంగ్ రన్ అవకాశం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే హాలీవుడ్ కి, థియేట్రికల్ రిలీజ్ కోసం రూపొందిన సినిమాలకు మంచి జరుగుతుంది అనే అభిప్రాయంను పలువురు సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం అవార్డ్‌లకు అర్హత సాధించడం కోసం మాత్రమే అన్నట్లుగా కాకుండా సినిమాను థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం స్క్రీనింగ్ చేయాలని జేమ్స్ కామెరూన్ వంటి ఫిల్మ్ మేకర్స్ కోరుకుంటున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీకి వార్నర్ బ్రదర్స్ వెళ్తే అది సాధ్యం కాకపోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.
