Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే ఇక మిగిలేది ఏమీ లేదు.. హాలీవుడ్ కు జేమ్స్ కామెరూన్ హెచ్చ‌రిక‌

హాలీవుడ్‌లో స్ట్రీమింగ్ వర్సెస్ థియేటర్ పోరు మరోసారి వేడెక్కింది. ప్రముఖ డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ నెట్‌ఫ్లిక్స్ మ‌రియు వార్న‌ర్ బ్రోస్.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Feb 2026 4:00 AM IST
అదే జ‌రిగితే ఇక మిగిలేది ఏమీ లేదు.. హాలీవుడ్ కు జేమ్స్ కామెరూన్ హెచ్చ‌రిక‌
X

హాలీవుడ్‌లో స్ట్రీమింగ్ వర్సెస్ థియేటర్ పోరు మరోసారి వేడెక్కింది. ప్రముఖ డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ నెట్‌ఫ్లిక్స్ మ‌రియు వార్న‌ర్ బ్రోస్. డిస్క‌వ‌రీ మ‌ధ్య ప్ర‌తిపాదిత ఒప్పందంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం, థియేట‌ర్ వ్య‌వ‌స్థ భ‌విష్య‌త్తుపై తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ డీల్ అమ‌లు జ‌రిగితే సినిమా హాళ్ల‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని కామెరూన్ బ‌హిరంగంగా హెచ్చ‌రించ‌డం ఇండ‌స్ట్రీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ ను కాపాడాలి

ఈ నేప‌థ్యంలోనే కామెరూన్, అమెరిక‌న్ సెనేట‌ర్ మైక్ లీకు లేఖ‌ను రాస్తూ అందులో తన ఆందోళ‌న‌ను స్ప‌ష్టంగా వ్య‌క్తం చేశారు. థియేట్రిక‌ల్ మోష‌న్ పిక్చ‌ర్ బిజినెస్ కు ఇది విప‌త్తు అవుతుంద‌ని, త‌న సినిమాలు త‌ర్వాత స్ట్రీమింగ్, వీడియో మార్కెట్ల‌లోనూ ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌తాయి కానీ త‌న మొద‌టి ఆప్ష‌న్ మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్సే అని పేర్కొంటూ, బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ ను కాపాడాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేశారు.

క్యామెరూన్ ఆందోళ‌న‌లో ప్ర‌ధాన అంశం థియేట‌ర్ల నిలుపుద‌ల. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యొక్క‌ బిజినెస్ మోడ‌ల్ ప్ర‌ధానంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ ఆధారిత‌మైందని, దీంతో సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్లే ధోర‌ణి పెరుగుతుంద‌ని, థియేట‌ర్ రిలీజ్‌లు త‌గ్గిపోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్నారు. పెద్ద స్టూడియోల్లో ఒక‌టైన వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ దిశ మార్చుకుంటే, మిగిలిన స్టూడియోల‌పైన కూడా ఒత్తిడి పెరిగి, భారీ బ‌డ్జెట్ సినిమాల ఉత్ప‌త్తి త‌గ్గిపోవ‌చ్చ‌నే భ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

థియేట‌ర్లు మూత ప‌డే అవ‌కాశం

హాలీవుడ్ లో థియేట్రిక‌ల్ రిలీజ్ సిస్ట‌మ్ అనేది కేవ‌లం వినోద వేదిక మాత్ర‌మే కాదు. అది ఎన్నో వేలాది మందికి ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌. సినీ నిర్మాణం నుంచి డిస్ట్రిబ్యూష‌న్, ఎగ్జిబిష‌న్ వ‌ర‌కు ఎన్నో విభాగాలు థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై ఆధార‌ప‌డుతున్నాయి. ఒక‌వేళ ప్ర‌ధాన స్టూడియో స్ట్రీమింగ్ దిశ‌గా మ‌ళ్లితే, థియేట‌ర్లు మూత‌ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలంటున్నాయి.

పెద్ద సినిమాల‌కు పెట్టుబ‌డులు త‌గ్గే అవ‌కాశాలు

భారీ కాన్వాస్, అత్యున్న‌త సాంకేతికత‌తో రూపొందే సినిమాలు థియేట‌ర్ల కోస‌మే రూపుదిద్దుకుంటాయి. అవి స్ట్రీమింగ్ కు ప‌రిమితమైతే ఆ స్థాయి నిర్మాణాల‌కు పెట్టుబ‌డులు త‌గ్గే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇది అమెరికా గ్లోబ‌ల్ సినిమాకు స‌వాల్ గా మారొచ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మైక్ లీ కూడా ఈ విష‌యంపై రియాక్ట్ అవుతూ, దీనిపై మ‌రింత విచార‌ణ జ‌ర‌పాల‌ని సూచించారు. మొత్తానికి కామెరూన్ హెచ్చ‌రిక హాలీవుడ్ కు ఓ డేంజ‌ల్ బెల్ గా మారింది. స్ట్రీమింగ్ వేగంగా విస్త‌రిస్తున్న ఈ కాలంలో థియేట‌ర్ వ్య‌వ‌స్థ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటుందా? లేదా అనేది చూడాలి మ‌రి.