ప్రసవ వేదనతో ఉన్నప్పుడు 'రాబోవు బిడ్డ' గురించి అడుగుతారా? కామెరూన్ ఛమత్కారం!
ఒక స్త్రీ ప్రసవ వేదనలో ఉన్నప్పుడు.. ఇప్పుడే కిరీటం ధరిస్తుండగా.. మీరు నెక్ట్స్ రాబోవు బిడ్డ గురించి అడుగుతారా? నేను ఇప్పుడే దీన్ని డెలివరీ చేసాను! అంటూ ఛమత్కారమైన సమాధానమిచ్చారు కామెరూన్.
By: Sivaji Kontham | 21 Dec 2025 11:44 AM ISTజేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చినా కానీ, డీసెంట్ కలెక్షన్లతో ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే 45కోట్ల వసూళ్లను సాధించి 100కోట్ల వసూళ్ల దిశగా సాగిపోతోంది.
ఇలాంటి సమయంలో అవతార్ -1, అవతార్ 2 కంటే అవతార్ 3 వసూళ్లు ఎందుకు తగ్గాయి? అనే చర్చ సాగుతోంది. కొందరు అయితే కామెరూన్ చెత్త సినిమా తీసాడు!! అంటూ సమీక్షల్లో తిట్టారు. కానీ కామెరూన్ మాత్రం వీటికి తలొంచకుండానే, తన సినిమాను సమర్థించుకుంటున్నారు. తాను చేసిన ప్రయత్నంలో ఎలాంటి లోపమూ లేదని వివరణ ఇస్తున్నాడు.
అతడికి కొన్ని అనూహ్యమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతలోనే అతడికి అవతార్ 4 ఉంటుందా ఉండదా? అనే ప్రశ్న కూడా ఎదురైంది. అవతార్ 4 గురించిన ప్రశ్నలకు జేమ్స్ కామెరూన్ మరోసారి నిజాయితీగా సమాధానం ఇచ్చారు. నాలుగో భాగం గురించి ప్రశ్నించగా, ప్రసవ వేదనతో ఉన్నప్పుడు నెక్ట్స్ పుట్టబోయే బిడ్డ గురించి అడుగుతారా? అని కామెరూన్ చాలా తెలివిగా ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలోనే అతడి సమాధానం కూడా దాగి ఉంది.
ఒక స్త్రీ ప్రసవ వేదనలో ఉన్నప్పుడు.. ఇప్పుడే కిరీటం ధరిస్తుండగా.. మీరు నెక్ట్స్ రాబోవు బిడ్డ గురించి అడుగుతారా? నేను ఇప్పుడే దీన్ని డెలివరీ చేసాను! అంటూ ఛమత్కారమైన సమాధానమిచ్చారు కామెరూన్. నిజానికి అవతార్ 3 విడుదలై ఇంకా వారం అయినా అవ్వలేదు. అప్పుడే అతడిని చాలామంది తూలనాడుతున్నారు. కామెరూన్ పై ఒక రకమైన ద్వేషంతో మాట్లాడేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే అన్నిటినీ ఆయన సహనంతో భరిస్తున్నాడు. ఓపిగ్గా సమాధానాలిస్తున్నాడు. అవతార్ 1, అవతార్ 2 చిత్రాలతో పోల్చినప్పుడు ఓపెనింగులు తక్కువగా ఉన్నా కానీ, అవతార్ 3 విజువల్ మాయాజాలానికి డీసెంట్ వసూళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఈ సినిమా రిలీజైన తొలి రెండు రోజుల్లోనే భారతదేశం నుంచి 45కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఇక ఇది ఈ ఆదివారం సోమ, మంగళ వారాల వసూళ్లను కలుపుకుని 100 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరుతుందని అంచనా వేస్తున్నారు.
అవతార్ 3 పై విమర్శలు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద వసూళ్లకు డోఖా లేదు. భారతదేశంలో, అంతర్జాతీయ మార్కెట్లలో ఫర్వాలేదనిపించే వసూళ్లను సాధిస్తోంది. ఈ వసూళ్లు మరీ అంత తీసికట్టుగా లేవని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 19న థియేటర్లలోకి విడుదలైంది. సైన్స్-ఫిక్షన్ జానర్ లో ఫ్రాంచైజీ సినిమాలు నిరంతర ప్రజాదరణను పొందుతున్నాయి. భారతదేశంలో మొదటి రోజు కేవలం 19కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం శనివారం నాడు 23కోట్లు సూలు చేయగా, ఆదివారం 25 కోట్ల మేర వసూలు చేస్తుందని అంచనా.
ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద `అవతార్ 3` బలమైన ప్రభావాన్ని చూపింది. వెరైటీ కథనం ప్రకారం... ఈ చిత్రం శుక్రవారం మాత్రమే ఉత్తర అమెరికా అంతటా 3,800 థియేటర్ల నుండి 36.5 మిలియన్ల డాలర్లను ఆర్జించింది. అవతార్ 3 వారాంతంలో డీసెంట్ కలెక్షన్లతో ఆదివారం నాటికి దేశీయంగా(అమెరికా) 90 మిలియన్ల డాలర్ల నుండి 105 మిలియన్ల డాలర్ల మధ్య వసూలు చేస్తుందని అంచనా. అంటే ఒక్క అమెరికా నుంచి 900కోట్లు వసూలు చేస్తున్న ఈ సినిమా, ప్రపంచ దేశాల నుంచి అంతే భారీగా వసూలు చేస్తోందని తెలిసింది.
