4 సార్లు వన్ బిలియన్ క్లబ్‌లో చేరిన ఏకైక దర్శకుడు
జేమ్స్ కామెరూన్ అవతార్ - ఫైర్ అండ్ యాష్ చిత్రానికి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీనికి తోడు దురంధర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా సాగిస్తుండటం కూడా అవతార్ 3కి కలిసి రాలేదు.
By: Sivaji Kontham | 4 Jan 2026 5:14 PM ISTజేమ్స్ కామెరూన్ అరుదైన ఘనతను సాధించారు. ఆయన అవతార్ ఫ్రాంఛైజీలో వరుసగా మూడో వన్ బిలియన్ డాలర్ క్లబ్ సాధించారు. ఇటీవలే విడుదలైన `అవతార్ - ఫైర్ అండ్ యాష్` 1బిలియన్ క్లబ్ లో చేరడంతో ఇప్పుడు నాలుగు సార్లు 1 బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.
అవతార్ -ఫైర్ అండ్ యాష్ చిత్రంతో కామెరూన్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలతో $1 బిలియన్ క్లబ్‌లో చేరిన ఏకైక దర్శకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. టైటానిక్, అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 చిత్రాలతో ఇది సాధ్యమమైంది.
కామెరూన్ తెరకెక్కించిన `అవతార్- ఫైర్ అండ్ యాష్` చిత్రం కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ మార్కును అధిగమించింది. ఇండియాలో కూడా ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లను సాధించి దూసుకుపోతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నందున ఇక్కడ థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ది రాజా సాబ్ మొదలు వరుసగా నాలుగైదు చిత్రాలు రిలీజవుతుండడంతో అవతార్ 3కి చోటు లేకుండా పోతుందని భావిస్తున్నారు. తమిళనాడులోను జననాయగన్ పండగ బరిలో అత్యంత భారీగా విడుదల కానుంది. ఆ మేరకు అవతార్ 3 థియేటర్ల సంఖ్య తగ్గుతుంది.
జేమ్స్ కామెరూన్ అవతార్ - ఫైర్ అండ్ యాష్ చిత్రానికి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీనికి తోడు దురంధర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా సాగిస్తుండటం కూడా అవతార్ 3కి కలిసి రాలేదు. భారతదేశంలో ఈ సినిమా విడుదలై 15 రోజులు పూర్తయేప్పటికి అంటే జనవరి 2 నాటికి ఫర్వాలేదనిపించే వసూళ్లను సాధించింది. భారతదేశంలో 15 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే ..ఇండియా నెట్ కలెక్షన్ రూ.163.60 కోట్లు. ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ.199.00 కోట్లు. 15వ రోజు నెట్ కలెక్షన్ రూ.3.40 కోట్లు. భాషల వారీగా నెట్ వసూళ్లు (15 రోజుల్లో) చూస్తే, ఈ సినిమాకు ఇండియాలో అత్యధిక వసూళ్లు ఇంగ్లీష్ వెర్షన్ నుండి వచ్చాయి. ఇంగ్లీష్ రూ.71.35 కోట్లు, హిందీ- రూ.54.60 కోట్లు, తమిళం రూ.23.98 కోట్లు, తెలుగు రూ.13.00 కోట్లు, కన్నడ & మలయాళంలో రూ.0.67 కోట్ల వసూళ్లు దక్కాయి.
టాక్ తో సంబంధం లేకుండా..
ఆసక్తికరంగా ఆరంభమే బ్లాక్ బస్టర్ టాక్ తో విడుదలైన `అవతార్-1`కి భారతదేశం నుంచి 165 - 200 కోట్ల మధ్య గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత యావరేజ్ టాక్ తో విడుదలైన `అవతార్ 2` కి ఇండియా వైడ్ ఏకంగా 380కోట్ల వసూళ్లు దక్కడం ఒక సంచలనం. ఇప్పుడు మిశ్రమ స్పందనలతో విడుదలైన `అవతార్ 3` చిత్రం భారతదేశంలో 200 కోట్ల గ్రాస్ మార్కును తాకడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న బాక్సాఫీస్ లెక్కల ప్రకారం `అవతార్: ఫైర్ అండ్ యాష్` భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ -10 హాలీవుడ్ చిత్రాల జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది.
