Begin typing your search above and press return to search.

24 ఏళ్లు క‌ష్ట‌ప‌డి 100 ఎకరాల్లో డ్రీమ్‌హౌస్ క‌ట్టాడు.. క‌ట్ చేస్తే అదే `అవ‌తార్` జ‌న్మ‌స్థ‌లం!

`అవతార్` ఫ్రాంఛైజీలో వ‌రుస‌గా మూడు సినిమాలు వ‌చ్చాయి. దాదాపు 6 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసారు.

By:  Sivaji Kontham   |   15 Sept 2026 8:00 AM IST
24 ఏళ్లు క‌ష్ట‌ప‌డి 100 ఎకరాల్లో డ్రీమ్‌హౌస్ క‌ట్టాడు.. క‌ట్ చేస్తే అదే `అవ‌తార్` జ‌న్మ‌స్థ‌లం!
X

`అవతార్` ఫ్రాంఛైజీలో వ‌రుస‌గా మూడు సినిమాలు వ‌చ్చాయి. దాదాపు 6 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసారు. ఇలాంటి సంచలన దృశ్యకావ్యాలకు ప్రాణం పోసిన లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ క‌థ‌లో చాలా ఆసక్తిక‌ర విష‌యాలున్నాయి. తాజాగా ఆయ‌న‌ నివాసం గురించి వెలుగులోకి వచ్చిన విష‌యాలు ఆశ్చ‌ర్యప‌రుస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ సముద్రతీర ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు...అవతార్ స్క్రిప్ట్‌లు జన్మించిన పవిత్ర ప్రదేశం. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీలో గల హాలీస్టర్ రాంచ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ ఉంది.

సెలబ్రిటీల ఇళ్లు సాధారణంగా రెండు మూడు సంవత్సరాల్లో తయారైపోతుంటాయి.. కానీ జేమ్స్ కామెరూన్ మాత్రం తన కలను సాకారం చేసుకోవడానికి ఏకంగా 24 సంవత్సరాలు తీసుకున్నారు. 1999లో సుమారు 4.4 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ సువిశాల భూమిలో తనకంటూ ఒక సుస్థిరమైన ఇంటిని నిర్మించుకున్నారు. `ట్రాంక్విలిటీ బేస్` అని పిలుచుకునే ఈ ప్రాపర్టీలో 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఇల్లు ఉంటుంది. ఇండోనేషియన్- బాలిస్థాన్ శైలి ఫర్నిచర్‌తో అలంకరించిన ఈ భవనం ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఈ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే.. దీని పైభాగంలో ఉన్న లైబ్రరీ గదిలోనే జేమ్స్ కామెరూన్ `అవతార్` చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లను రాశారు. అలాగే 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గెస్ట్ హౌస్‌ను ఆయన తన ప్రత్యేక కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. పూర్తిగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దిన ఈ ఇంట్లో సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడంతో పాటు హెలికాప్టర్లు, సబ్‌మెరైన్లు, రోబోటిక్ ఎక్స్‌పెడిషన్ పరికరాలను ప్ర‌ద‌ర్శించ‌డానికి 24,000 చదరపు అడుగుల బార్న్ ఏరిటాను కూడా ఏర్పాటు చేశారు.

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడానికి... సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నిలిచిన ఈ అద్భుతమైన ప్రాపర్టీని జేమ్స్ కామెరూన్ 2023లో అమ్మకానికి పెట్టారు. సుమారు 33 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో 317 కోట్లు) విలువ చేసే ఈ క్లిఫ్‌సైడ్ హావ్ హోమ్‌ను విక్రయించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఒక గ్రేట్ క్రియేటర్ ఆలోచనలు రూపుదిద్దుకున్న ఈ డ్రీమ్ హౌస్ ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.