బాండ్ 007 ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సంక్రాంతి కానుక
15 జనవరి 2026 నుండి బాండ్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి.
By: Sivaji Kontham | 21 Dec 2025 1:53 PM ISTఇటీవలి కాలంలో కొన్ని భారీ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను చూడాలనుకుంటే, అభిమానులకు ఓటీటీల్లో అందుబాటులో ఉండటం లేదు. అలాంటి కేటగిరీలో అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ నిర్మించిన యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జేమ్స్ బాండ్ -007 ఫ్రాంఛైజీ నుంచి డై అనదర్ డే, నో టైమ్ టు డై, క్వాంటం ఆఫ్ సోలేస్, స్కైఫాల్ లాంటి సినిమాలను చూడాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ లేదా ఇతర పెద్ద ఓటీటీలలో ఇవి అందుబాటులో లేవు.
కేవలం నెట్ ఫ్లిక్స్ లేదా ఇంకేదైనా ఓటీటీలో సబ్ స్క్రిప్షన్లు ఉన్నా కానీ బాండ్ సినిమాలు వీటిలో అందుబాటులో లేవనే నిరాశ అభిమానుల్లో ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల ప్రియులకు ఇది ఒక లోటుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ప్రఖ్యాత అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త లైసెన్సింగ్ విధానం ప్రకారం... జేమ్స్ బాండ్ సిరీస్ లోని ఆసక్తికర యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు డై అనదర్ డే, నో టైమ్ టు డై, క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తాయి. కొత్త లైసెన్సింగ్ ప్రకారం... ఈ సినిమాలు కేవలం మూడు నెలలు మాత్రమే వీక్షకులకు అందుబాటులో ఉంటాయి. కాలపరిమితి ప్రకారం అందుబాటులో ఉండే వీటిని వెంటనే సబ్ స్క్రైబర్లు వీక్షించాల్సి ఉంటుందన్నమాట.
15 జనవరి 2026 నుండి బాండ్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, బెనెలక్స్ - నార్డిక్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలలో బాండ్ సినిమాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే బాండ్ చిత్రాలతో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో అమెజాన్ యాజమాన్యంలోని ఇతర సినిమాలను కూడా స్ట్రీమింగ్ లో కి తెచ్చేందుకు సన్నాహకాల్లో ఉంది. వీటిలో రాకీ, క్రీడ్, లీగల్లీ బ్లోండ్, సిరీస్ ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్ వంటి పలు ఆసక్తికర సినిమాలు ఉన్నాయి.
ఇలాంటి జంబ్లింగ్ సినిమాల వ్యవహారంతో నెట్ ఫ్లిక్స్ తన ఇమేజ్ ని మరింత తెలివిగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రపంచ దేశాలలో మరింత క్రేజీగా మాస్ యాక్షన్ సినిమాల ఆడియెన్ ని ఓటీటీలకు రప్పించేందుకు సహకరిస్తుంది. ఈ ఒప్పందం కారణంగా అమెజాన్ MGM స్టూడియోస్‌కు లైసెన్సింగ్ ఆదాయం కూడా భారీగా ముడుతుంది. అలాగే సదరు స్టూడియోలో దాచిన వీడియో లైబ్రరీ విలువను పెంచే ప్రయత్నంగాను దీనిని చూడాలి. ఇక నెట్ ఫ్లిక్స్ తో ఇలాంటి ఒప్పందం ఉన్నా కానీ, ఎంజిఎం స్టూడియోస్ లోను ఈ సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి. అటు ఎంజీఎంలో, ఇటు నెట్ ఫ్లిక్స్ లోను బాండ్ సినిమాలు అందుబాటులోనే రావడం యాక్షన్ ప్రియులకు గొప్ప శుభవార్త.
