మహేష్ వర్సెస్ పవన్.. సైలెంట్ క్లాష్
ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే పవన్ కళ్యాణ్ 'జల్సా', సూపర్ స్టార్ మహేష్ బాబు 'మురారి' చిత్రాలు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.
By: M Prashanth | 31 Dec 2025 10:45 AM ISTన్యూ ఇయర్ వేడుకలకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ఎప్పుడూ కొత్త సినిమాలతో సందడి ఉండే థియేటర్లలో, ఈసారి ఇద్దరు స్టార్ హీరోల క్లాసిక్ హిట్స్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే పవన్ కళ్యాణ్ 'జల్సా', సూపర్ స్టార్ మహేష్ బాబు 'మురారి' చిత్రాలు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. చాలా హఠాత్తుగా, సైలెంట్ గా మొదలైన ఈ పోరులో బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతుండటం విశేషం.
నిజానికి ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ కావడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనే ఒకటి రెండు సార్లు ఈ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి, భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. సాధారణంగా పదే పదే ఒకే సినిమాను రిలీజ్ చేస్తే ఆడియెన్స్ నుంచి పెద్దగా స్పందన ఉండదు, బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ ఇద్దరు హీరోల క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. ఎన్నిసార్లు వచ్చినా చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారని తాజా బుకింగ్స్ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి.
ప్రస్తుత బుకింగ్స్ బజ్ ని గమనిస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమా రేసులో కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. బుక్ మై షో వంటి టికెటింగ్ యాప్స్ లో ట్రెండింగ్ లో ఉంటూ, గత 24 గంటల్లోనే ఏకంగా 15 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే పవన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం యూత్ ఈ సినిమా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
మరోవైపు మహేష్ బాబు క్లాసిక్ హిట్ 'మురారి' కూడా గట్టి పోటీనే ఇస్తోంది. కృష్ణవంశీ మ్యాజిక్, మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. గత 24 గంటల్లో ఈ సినిమాకు కూడా సుమారు 6 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియెన్స్, క్లాస్ మూవీ లవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ ఎమోషనల్ డ్రామాను ఎంచుకుంటున్నారు. రేటింగ్స్ పరంగా చూస్తే జల్సా 9.8 తో లీడ్ లో ఉంటే, మురారి 9.7 తో గట్టి పోటీ ఇస్తోంది.
అయితే ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. సాధారణంగా రీ రిలీజ్ ల కోసం వారం రోజుల ముందు నుంచే హడావిడి చేస్తారు. కానీ ఈసారి మాత్రం చాలా సడన్ గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ బుకింగ్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కొత్త సినిమాల రిలీజ్ లు పెద్దగా లేకపోవడం, న్యూ ఇయర్ మూడ్ ని తమ అభిమాన హీరో సినిమాతో ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ థియేటర్ల వైపు చూస్తుండటం దీనికి ఒక కారణం కావచ్చు.
2025కి వెల్కమ్ చెప్పే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పాత జ్ఞాపకాల హడావుడి కనిపిస్తోంది. ఒకపక్క పవన్ మాస్ అండ్ క్లాస్ కామెడీ, మరోపక్క మహేష్ ఎమోషనల్ డ్రామా.. రెండూ ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కలెక్షన్స్ లో ఎవరు గెలిచారనే దానికంటే, తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను బిగ్ స్క్రీన్ పై మరోసారి చూసి ఎంజాయ్ చేయడమే ఫ్యాన్స్ కు అసలైన కిక్. చూడాలి మరి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో.
