జల్సా వర్సెస్ 'మురారి.. ఏ సినిమా క్లిక్కయ్యింది?
న్యూ ఇయర్ వీకెండ్ అంటేనే కొత్త సినిమాల సందడి ఉండాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది.
By: M Prashanth | 2 Jan 2026 6:11 PM ISTన్యూ ఇయర్ వీకెండ్ అంటేనే కొత్త సినిమాల సందడి ఉండాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతే, పాత సినిమాలు మాత్రం మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా', సూపర్ స్టార్ మహేష్ బాబు 'మురారి' రీ రిలీజ్ లతో థియేటర్ల దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది.
డిసెంబర్ 31 రాత్రి నుంచే ఈ రెండు సినిమాల హడావిడి మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ 'జల్సా' ఏకపక్షంగా దూసుకెళ్లింది. ఆరంభంలో 'మురారి' కాస్త స్లోగా అనిపించినా, ఆ తర్వాత పుంజుకుని న్యూ ఇయర్ రోజున మంచి జోరు చూపించింది. ఫ్యాన్స్ తమ హీరోల వింటేజ్ సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎగబడ్డారు.
ఇక టికెట్ సేల్స్ లెక్కలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. బుక్ మై షో డేటా ప్రకారం డిసెంబర్ 31 నాటికి 'జల్సా' ఏకంగా 31 వేల టికెట్లు అమ్ముడుపోగా, 'మురారి' 20 వేల మార్క్ ని అందుకుంది. న్యూ ఇయర్ రోజున 'మురారి' బుకింగ్స్ పెరిగినా, ఓవరాల్ గా చూస్తే 'జల్సా' 34 వేల టికెట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 'మురారి' 24 వేలకు పైగా టికెట్లతో గట్టి పోటీని ఇచ్చింది.
వసూళ్ల విషయానికి వస్తే పవర్ స్టార్ స్టామినా మరోసారి ప్రూవ్ అయ్యింది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో 'జల్సా' ఏకంగా 72 నుంచి 75 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండటం కూడా కలెక్షన్స్ భారీగా రావడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
మరోవైపు 'మురారి' స్ట్రాటజీ వేరేలా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాకు టికెట్ ధరలు 99 నుంచి 105 రూపాయల మధ్య ఉండటంతో సామాన్య ప్రేక్షకులు కూడా ఎగబడ్డారు. దీంతో డీసెంట్ ఫుట్ ఫాల్స్ నమోదయ్యాయి. తక్కువ రేట్లు ఉన్నప్పటికీ, ఈ చిత్రం 48 నుంచి 50 లక్షల రేంజ్ లో వసూళ్లు రాబట్టి మహేష్ బాబు క్రేజ్ ఏంటో చూపించింది.
ఏదేమైనా న్యూ ఇయర్ వీకెండ్ లో కొత్త సినిమాలు డల్ అయినా, ఈ పాత క్లాసిక్స్ మాత్రం బాక్సాఫీస్ కి కొత్త కళ తెచ్చాయి. పవన్, మహేష్ ఫ్యాన్స్ పోటాపోటీగా తమ సినిమాలను సెలబ్రేట్ చేసుకున్నారు. రేట్లు, టికెట్ల లెక్కలు ఎలా ఉన్నా.. రెండు సినిమాలు స్పెషల్ షోలతో కుమ్మేశాయనే చెప్పాలి. ఇక వీకెండ్ లో లెక్క ఎలా ఉంటుందో చూడాలి.
