Begin typing your search above and press return to search.

వాళ్లు అనుకుంటే వీళ్లు.. సినీ 'దసరా'పైనే అందరి ఫోకస్..

సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్లకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సంక్రాంతి, దసరా వంటి సీజన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.

By:  M Prashanth   |   4 July 2026 11:00 PM IST
వాళ్లు అనుకుంటే వీళ్లు.. సినీ దసరాపైనే అందరి ఫోకస్..
X

సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్లకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సంక్రాంతి, దసరా వంటి సీజన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే ముందుగానే రిలీజ్ డేట్లను లాక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో 2026 సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ దసరాపై పడింది. మొదట కొన్ని సినిమాలు ఆ సీజన్‌ ను టార్గెట్ చేయగా.. ఇప్పుడు వాటి స్థానంలో మరో రెండు భారీ చిత్రాల పేర్లు వినిపిస్తున్నాయి.

దసరా బాక్సాఫీస్ రేసులో రజనీకాంత్ జైలర్ 2 ప్రధానంగా కనిపిస్తోంది. ఆ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు క్లారిటీ వచ్చింది. జైలర్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌ పై అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ క్రేజ్‌ కు తోడు సీక్వెల్ కావడంతో భారీ రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. దీంతో దసరా సీజన్‌ లో జైలర్ 2కు పోటీగా వచ్చే సినిమా ఏదనే ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు ఆ స్థానంలో చిరంజీవి విశ్వంభర పేరు వినిపిస్తోంది. నిజానికి ఆ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు దసరాకు విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఒక్క రోజు గ్యాప్‌లో రజనీకాంత్, చిరంజీవి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది.

నిజానికి దసరా సీజన్‌ ను ముందుగా టార్గెట్ చేసిన సినిమాలు వేరే ఉన్నాయి. నాగార్జున తన వందో సినిమాను పండగ సీజన్‌ లో తీసుకురావాలని భావించారు. అలాగే ప్రభాస్ ఫౌజీ దసరా బరిలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమాలు అనుకున్న సమయానికి సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వాళ్లు అనుకున్న దసరా సీజన్‌ లోకి ఇప్పుడు జైలర్ 2, విశ్వంభర వస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటి సీజన్లలో ముందుగానే సినిమాలు రిలీజ్ డేట్లను లాక్ చేసుకుంటున్నాయి. సెలవులు ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో మేకర్స్ ఆ సీజన్లను వదులుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం దసరా లెక్కలు చూస్తే ఇద్దరు సీనియర్ స్టార్ల సినిమాల చుట్టూనే ప్రధాన పోటీ కనిపిస్తోంది.

ఒకవేళ జైలర్ 2, విశ్వంభర అనుకున్న తేదీలకే వస్తే దసరా బాక్సాఫీస్ ఆసక్తికరంగా మారడం ఖాయం. అయితే భారీ సినిమాల రిలీజ్ లెక్కలు చివరి వరకు మారుతూనే ఉంటాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర సినిమాలతో పోటీ వంటి అంశాల ఆధారంగా డేట్లు మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న దసరా ప్లాన్ చివరి వరకు అలాగే ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికి వాళ్లు అనుకున్న సీజన్‌ లోకి వీళ్లు వస్తుండటంతో సంక్రాంతి తర్వాత ఫోకస్ మొత్తం ఇప్పుడు దసరాపైనే పడినట్లు కనిపిస్తోంది