బిగ్ న్యూస్: ఇద్దరు సూపర్‌స్టార్ల కలయికలో
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే దానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఆ స్థాయి ఛరిష్మా ఆయనకు ఉంది.
By: Sivaji Kontham | 25 Dec 2025 12:49 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే దానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఆ స్థాయి ఛరిష్మా ఆయనకు ఉంది. సీనియర్లలో అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి వంటి కథానాయకులు ఏ భాషలో నటిస్తున్నా, వారు ఏం చేసినా అది నేషనల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణ ఉన్న వార్త. ఇప్పుడు రజనీ నటిస్తున్న జైలర్ 2 గురించి చాలా చర్చ సాగుతోంది. ఈ సినిమాని భారీ మల్టీస్టారర్ కేటగిరీలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్.
మోస్ట్ అవైటెడ్ జైలర్ 2 కోసం నెల్సన్ ఎంపిక చేసుకున్న నటీనటుల జాబితా కూడా అంతకంతకు ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి అనుకోకుండా కాస్టింగ్ గురించి ఒక లీక్ ఇచ్చారు. ఈ ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ లో షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నారని ఓ బెంగాళీ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటివరకూ ఈ సినిమా కాస్టింగ్ గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇంతలోనే మిథున్ మీడియాకు ఉప్పందించడంతో అది కాస్తా సెన్సేషనల్ వార్తగా మారింది. రజనీకాంత్- షారూఖ్ ఖాన్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా ఇప్పుడు `జైలర్ 2` కి ప్రచారం పీక్స్ కి చేరుకోనుంది.
ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా కథ ఏది? అని ప్రశ్నించగా మిథున్ మాట్లాడుతూ.. జైలర్ 2 కథాంశం తనను బాగా ఆకర్షించిందని తెలిపారు. అదే సమయంలో నటీనటుల వివరాల గురించి మాట్లాడుతూ.. మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణన్, శివరాజ్‌కుమార్ తదితరులు ఇందులో నటిస్తున్నారని లీక్ చేసారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ పేరును అతడు లీక్ చేయడంతో అది సంచలనంగా మారింది. నిజానికి జైలర్ 2 కాస్టింగ్ గురించి దర్శకనిర్మాతలు కానీ, చిత్ర కథానాయకుడు రజనీ కానీ లీక్ చేయలేదు.
ఇక రజనీకాంత్ తో షారూఖ్ స్నేహం ఈనాటిది కాదు. అప్పట్లో కింగ్ ఖాన్ నటించిన రా-వన్ చిత్రంలో కొన్ని నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్రలో నటించాల్సిందిగా రజనీకాంత్ ని ఖాన్ కోరారు. దానికి వెంటనే అంగీకరించిన రజనీ అందులో ఒక రోబో పాత్రలో కనిపించారు. రా-వన్ విజయం సాధించకపోయినా, స్నేహం కోసం విలువిచ్చి తన కోసం ఆ పాత్రలో నటించిన రజనీ అంటే షారూఖ్ కి ఎంతో గౌరవం. ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకునేందుకు అతడు జైలర్ 2లో అతిథి పాత్రకు అంగీకరించాడా? అంటూ తెలుగు మీడియాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే షారూఖ్ అతిథి పాత్ర ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా కలెక్షన్స్ ని పెంచుతూ, మైలేజ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక పెద్ద స్టార్ నటించారులే అనుకుంటే ఈ పాత్ర కోసం అతడిని ఎంపిక చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు.
