Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న సీక్వెల్ లో కామియోలపై క్లారిటీ!

తాజాగా ఈ గందరగోళానికి తెరదించుతూ చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   7 Jun 2026 11:48 AM IST
సంచ‌ల‌న సీక్వెల్ లో కామియోలపై క్లారిటీ!
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `జైల‌ర్ 2` ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం 700 కోట్లు వ‌సూళ్లు సాధించ‌డంతో `జైల‌ర్ 2` తో ఏకంగా 1000 కోట్లు సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాల‌ని ర‌జ‌నీ అండ్ కో గ‌ట్టిగానే ప్లాన్ చేసి బ‌రిలోకి దిగుతుంది. సీక్వెల్ ప్ర‌క‌టన నాటి నుంచి సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ప్రాజెక్ట్ డిలే అయినా? హైప్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మొదటి భాగం అందించిన భారీ విజయంతో? `జైల‌ర్ 2` ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

అయితే సినిమాపై ఉన్న సహజమైన ఆసక్తి క్రమంగా రకరకాల పుకార్ల వల్ల పక్కదారి పడుతోందన్న‌ది అంతే వాస్త‌వం. ఈ చిత్రంలో కనిపించబోయే అతిథి పాత్రల గురించి సోషల్ మీడియాలో వ‌స్తోన్న‌ వార్తలు సినిమా అసలు క్రేజ్‌ను నీరుగారుస్తున్నాయి. ఇందులో తొలుత నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తారని ప్రచారం సాగింది. అటుపై కొన్ని రోజుల‌కు బాల‌య్య న‌టించ‌లేద‌ని ఆ స్థానంలో విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఇత‌డితో పాటు పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఎట్రీ ఇస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

మ‌రికొన్ని రోజుల‌కు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా సినిమాలో నటిస్తున్నారంటూ జాతీయ స్థాయిలో జోరుగా ఊహాగానాలు సాగాయి. ఇలా అగ్ర తార‌ల ఎంట్రీతో `జైల‌ర్ 2` ఆకాశాన్నంటింది. అయితే ఒక సినిమాలో పెద్ద నటులు అతిథి పాత్రల్లో కనిపించడం అనేది పబ్లిసిటీకి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ అదే పనిగా నిత్యం ఒకరి తర్వాత ఒకరి పేర్లు మారుతూ ప్రచారంలోకి రావడం వల్ల ప్రేక్షకులు ఉత్సాహపడటం కంటే అయోమయానికి గురవుతుంటారు. కథకు ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుంది? కేవలం నటుల కలయిక కోసమే సినిమా తీస్తున్నారా? అనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవడానికి మితిమీరిన ప్రచారమే కారణమని చెప్పొచ్చు.

తాజాగా ఈ గందరగోళానికి తెరదించుతూ చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాకు మరో పెద్ద స్టార్ కామియో అవసరం లేదని.. కథాగమనానికి ఆ పాత్రలు ఆటంకం కలిగిస్తాయని భావించిన దర్శకుడు నెల్సన్ ఆ త‌ర‌హా పాత్ర‌ల‌ను ఎలిమినేట్ చేసిన‌ట్లు స‌మాచారం. స్టార్ పవర్‌పై ఆధారపడకుండా.. కథ బలంపైనే ముందుకెళ్లాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ప్రస్తుతుం ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ర‌జ‌నీకాంత్ ఊటీ వెకేష‌న్ అనంత‌రం జూన్ 8 లేదా 9 తేదీల్లో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు.