కూలీకి వచ్చిన రజనీ 'జైలర్ 2' కి ఎందుకు రాలేదు?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్ 2' విడుదలకు రెడీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న 'జైలర్ 2' కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది.
By: Ramesh Palla | 13 Oct 2026 10:37 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్ 2' విడుదలకు రెడీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న 'జైలర్ 2' కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. భారీ మొత్తానికి ఈ సినిమాను కొన్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినా కూడా జైలర్ సినిమా హిట్ నేపథ్యంలో జైలర్ 2 ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు భారీ ఆశలు పెట్టుకుని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల పెంపుకు అనుమతులు దక్కాయి. దాంతో కచ్చితంగా అక్కడ ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధ్యం అని సితార కాంపౌండ్‌లో అనుకుంటున్నారు.
జైలర్ 2 సినిమాను తెలుగులో నాగవంశీ...
సినిమా టికెట్ల హైక్ కోసం ప్రయత్నించిన సితార వారు ఎందుకు రజనీకాంత్‌ను హైదరాబాద్ తీసుకు రాలేక పోయారు అనే ప్రశ్న వినిపిస్తోంది. కనీసం మీడియా సమావేశం కోసం అయినా రజనీకాంత్ ను హైదరాబాద్ తీసుకు రావాల్సింది కదా అంటూ చాలా మంది నాగవంశీని ప్రశ్నిస్తున్నాడు. రజనీకాంత్ గత చిత్రం 'కూలీ' ప్రమోషన్‌లో భాగంగా రజనీకాంత్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ ఈసారి జైలర్ 2 సినిమా కోసం ఎందుకు రాలేదు అనే ప్రశ్న వినిపిస్తుంది. నాగ వంశీ ముందస్తుగా ఒప్పందం చేసుకోలేదా లేదంటే, నాగవంశీ ఆయన అవసరం లేదని ఏమైనా భావించాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 కి ఉన్న బజ్ తో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నాడేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ ప్రెస్ మీట్‌లో...
రజనీకాంత్ సినిమాలు కన్నడంలోనూ భారీగా విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం. ఈసారి రజనీకాంత్ అక్కడ కూడా ప్రచారంకు వెళ్లలేదు. కేవలం ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ మాత్రమే చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ కనిపించలేదు. ఆయన ఆరోగ్యం దృష్ట్య మీడియా సమావేశాలకు, పబ్లిక్ ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నాడనే వార్తలు తమిళ సినీ వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. రజనీకాంత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది, తమిళ ప్రేక్షకుల మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు రజనీకాంత్ ను అభిమానిస్తారు. అయినా కూడా హైదరాబాద్ రావడంకు రజనీకాంత్ కి ఏంటి ఇబ్బందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ మాత్రమే కాకుండా చాలా మంది తమిళ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.
జైలర్ 2 హైదరాబాద్ ప్రెస్ మీట్..
తెలుగు ప్రేక్షకుల అభిమానం, కలెక్షన్స్ కావాలే కానీ, తెలుగు ప్రేక్షకులను ఆ హీరోలు కనీసం గౌరవించడం లేదు అనే విమర్శలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు రజనీకాంత్ రెగ్యులర్‌గా తన సినిమాల ప్రమోషన్ కి హైదరాబాద్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా కూలీ సినిమాకు వచ్చాడు. అంతకు ముందు జైలర్ 1 సినిమాకు రజనీకాంత్ రాలేదు. ఇప్పుడు కూడా రజనీకాంత్ హైదరాబాద్ రాలేదు. రజనీకాంత్ హైదరాబాద్ ఈవెంట్‌కి మాత్రమే కాకుండా, ఎక్కడ కూడా ఆయన ఈవెంట్స్ లో పాల్గొనలేదు. కనుక ఇక్కడ వివాదం ఏమీ లేదని, ఆయన పరిస్థితుల కారణంగానే మొత్తం ప్రెస్ మీట్స్ కి, ఈవెంట్స్ కి దూరంగా ఉన్నాడు. కేవలం హైదరాబాద్ ప్రెస్ మీట్ కి రాకుంటే అప్పుడు విమర్శించాలని ఆయన ఫ్యాన్స్ సర్ది చెప్పుకుంటున్నారు. జైలర్ 2 తెలుగు ప్రెస్ మీట్ ఇటీవల చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో రజనీకాంత్ లేకుండా హైదరాబాద్ లో జరిగిన విషయం తెల్సిందే. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ తదుపరి సినిమాలకైనా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వస్తాడేమో చూడాలి.
