షాక్ ఇచ్చిన పూర్ణ..ఇకపై ప్రయాణం ఎలా?
తెలుగు, తమిళ చిత్రసీమల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ (షమ్నా కాసిమ్) ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు.
By: Srikanth Kontham | 18 Oct 2026 7:32 PM ISTతెలుగు, తమిళ చిత్రసీమల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ (షమ్నా కాసిమ్) ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ అవైటెడ్ మూవీ `జైలర్ 2`లో ఆమె స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఈ సినిమాలో పూర్ణ ఐటమ్ సాంగ్ చేస్తోందనే విషయం విడుదల వరకు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. దీంతో థియేటర్లలో వెండితెరపై ఆమెను ఆ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్లో చూసిన ప్రేక్షకాభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో ఇచ్చిన ఇలాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కడం పూర్ణ కెరీర్‌కు లభించిన అతిపెద్ద అవకాశంగా చెప్పొచ్చు. క్యారెక్టర్ రోల్స్ .. కథానాయికగా కాకుండా ఇలాంటి మాస్ స్పెషల్ నంబర్లో ప్రజెంట్ చేయడం బిగ్ స్క్రీన్ పై మంచి ఇంపాక్ట్ చూపించింది. పాటలో అమ్మడి గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పూర్ణ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
నిజానికి పూర్ణకు ఐటమ్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా మూడు, నాలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసి డ్యాన్స్ ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే ఆ పాటలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ ఐటమ్ భామగా వరుస ఆఫర్లు తెచ్చిపెట్టడంలో .. కెరీర్‌ను బిజీ చేయడంలో అంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్ణ ప్రధానంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే పరిమితమయ్యారు.
తాజాగా `జైలర్ 2` రూపంలో లభించిన పాన్-ఇండియా వేదిక పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్‌కు కొత్త ఊపిరి పోస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. వివాహం, మాతృత్వం తర్వాత కెరీర్ విషయంలో విరామం తీసుకున్న పూర్ణ మళ్లీ రీ-ఎంట్రీలో ఇంతటి బోల్డ్ అండ్ గ్లామరస్ అవతార్ ఎత్తుతారని ఊహించలేదు. ఈ సినిమా తెచ్చిన సంచలనంతో పూర్ణ గ్లామర్ ఇమేజ్‌కి టాలీవుడ్, కోలీవుడ్‌లలో మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
సాధారణంగా దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీలో ఉన్న కథానాయికలు సెకండ్ ఇన్నింగ్స్‌లో వదిన, అక్క లేదా క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమవుతుంటారు. కానీ పూర్ణ మాత్రం లుక్స్, ఫిట్నెస్తో గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధ మేనని ఈ పాట ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ చేసే భామలకు భారీగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో పూర్ణ ఈ అవకాశాన్ని పక్కాగా వాడుకుంటే వరుస ఆఫర్లు రావడం ఖాయం.
మరి `జైలర్ 2`లో పూర్ణ ఇచ్చిన బిగ్ షాక్ ఆమె ప్రయాణాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో? వేచి చూడాలి. ఇప్పటి వరకు నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పించిన మిల్కీ బ్యూటీ ఇకపై ఐటమ్ సాంగ్స్‌తో లేడీ స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుందా? లేదా గ్లామరస్ సెకండ్ ఇన్నింగ్స్‌తో హోరెత్తిస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
