Begin typing your search above and press return to search.

ట్రైలర్‌లో చూపి థియేటర్‌లో మోసం చేశారు!

మొదటి భాగంలో `మ్యాథ్యూ` పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కారణంగా `జైలర్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 1:34 PM IST
ట్రైలర్‌లో చూపి థియేటర్‌లో మోసం చేశారు!
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేష‌న్ లో ఇటీవ‌లే జైల‌ర్ 2 భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే చిత్రంలో మోహన్‌లాల్ స్క్రీన్ టైమ్ ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉండటం.. పైగా ట్రైలర్‌లో చూపిన కొన్ని కీలక సన్నివేశాలు థియేట్రికల్ కట్‌లో కనిపించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ వివాదంపై మోహన్‌లాల్ సన్నిహితుడు, నిర్మాత ఆంటోని పెరుంబవూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తిపై స్పందించిన ఆంటోని పెరుంబవూర్ కేరళ ప్రేక్షకులకు .. మోహన్‌లాల్ అభిమానులకు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి ఉందని కుండబద్దలు కొట్టేశారు. `మలయాళీలు సాధారణంగా ఈ విషయంలో అంత సంతోషంగా లేరు. అలాగే మేమూ కూడా` అంటూ మనసులోని అసంతృప్తిని బయటపెట్టారు. మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఈ స్థాయిలో ఎడిట్ చేసి తొలగిస్తారనే విషయం మోహన్‌లాల్‌కి గానీ.. ఆయన టీమ్‌కి గానీ ముందే తెలియదని స్పష్టం చేశారు.

మొదటి భాగంలో `మ్యాథ్యూ` పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కారణంగా `జైలర్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమాలో ఆయన రోల్ ఊహించినదానికంటే కుదించబడటంతో పాటు ట్రైలర్‌లో కనిపించిన కొన్ని విజువల్స్ ఫైనల్ కట్‌లో లేకపోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంటోని పెరుంబవూర్ చేసిన కామెంట్స్ యూనిట్ మధ్య ఎక్కడో సమన్వయ లోపం జరిగిందనే చర్చకు దారితీశాయి.

అలాగే ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాల్లో మోహన్‌లాల్‌కి బాడీ డబుల్‌గా పని చేశానంటూ జోబీ కొడకర అనే మిమిక్రీ ఆర్టిస్ట్ ఫొటోలు షేర్ చేయడం మరింత వివాదానికి దారితీసింది. అయితే దీనిపై స్పష్టతనిచ్చిన జోబీ, కేవలం డ్రైవింగ్ చేసే సీన్స్ ..ఒకట్రెండు షాట్లలో మాత్రమే తన కాళ్లు, చేతులు కనిపించాయని, క్లైమాక్స్‌లో చూపించిన మోహన్‌లాల్ ముఖం తనది కాదని స్పష్టం చేశారు. కేవలం షూటింగ్ సెట్‌లో తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేయడం వల్ల ఇలాంటి అనవసర ఊహాగానాలు చెలరేగాయని వివరణ ఇచ్చారు.

ఈ వివాదాలు ..విమర్శలు ఎలా ఉన్నా? బాక్సాఫీస్ వద్ద మాత్రం `జైలర్ 2` దూకుడు కొనసాగుతూనే ఉంది. విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న యాక్షన్ డ్రామా ఇప్పటికే 770 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి అరుదైన మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. త్వరలోనే ఈ చిత్రం 800 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమవుతోంది.