'కావాలా' మళ్లీ కావాలంటున్నారు.. ఈసారి `పూర్ణ` స్టెప్పు మ్యాజిక్ చేస్తోంది కానీ!
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ `జైలర్ 2` నుంచి ఫస్ట్ సింగిల్ `అలా బోలేలో` లిరికల్ వీడియోను సన్ పిక్చర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసింది.
By: Sivaji Kontham | 21 Aug 2026 10:48 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ `జైలర్ 2` నుంచి ఫస్ట్ సింగిల్ `అలా బోలేలో` లిరికల్ వీడియోను సన్ పిక్చర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ వేడుక పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో విపరీతమైన బజ్‌ను సృష్టించింది.
ఈ పాటలో నటి శమ్నా కాసిమ్ (పూర్ణ) సాంప్రదాయ కేరళ శైలిలో చేసిన స్పీడ్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా పూర్ణ చూపించిన ఎనర్జీ, పర్‌ఫెక్షన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా ఈ పాటలో రజనీకాంత్ కేవలం సీరియస్‌గా చూస్తూ నడుచుకుంటూ రావడం చూసి అభిమానులు ఆయనను సరదాగా ``ఎగ్జామ్ హాల్ సూపర్‌వైజర్`` అని.. అలాగే నెల్సన్ రజనీతో కేవలం వాకింగ్ మాత్రమే చేయించారని కామెంట్లు చేస్తున్నారు.
ఓణం పండుగను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ పాటపై మలయాళీ .. తమిళ ప్రేక్షకుల నుంచి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తమిళం, మలయాళ పదాల మిశ్రమంతో ఉన్న ఈ పాటలో లిరిక్స్ - ఉచ్చారణ స్పష్టంగా లేవని.. అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. మొదటి భాగంలోని `కావాలా` రేంజ్ మ్యాజిక్ లేదా క్యాచ్‌నెస్ ఈ పాటలో కొంత కొరవడిందనే చర్చ కూడా జరుగుతోంది.
ఏది ఏమైనా.. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ అందించిన ఉత్సాహభరితమైన మ్యూజిక్ .. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కాంబినేషన్‌తో ఈ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను సాధిస్తోంది. పదే పదే వింటే ఈ పాట మరింత ఎక్కేస్తుందని చెప్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు, మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.
కావాలా.. మళ్లీ కావాలంటున్నారు!
`జైలర్`చిత్రంలో తమన్నా భాటియా `కావాలా` పాట ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపే ఊపిన సెన్సేషనల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ అందించిన ఉత్సాహభరితమైన ట్యూన్, వైబ్రాంట్ పాప్ బీట్స్‌కు తోడు తమన్నా ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్స్, వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ పాటలోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి లక్షలాది మంది రీల్స్ చేయడానికి ప్రేరణగా నిలిచింది. రజనీకాంత్ సరళమైన స్వాగ్, తమన్నా గ్లామర్ అండ్ గ్రేస్ కలగలిసి ఈ పాటను సినిమా విజయంలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా మార్చాయి.
