ఒకే ఒక్కడు.. 76 ఏళ్ల వయసులోనూ.. రజినీపై అనిరుధ్ భావోద్వేగ లేఖ..
భారతీయ చలనచిత్ర రంగంలో `సూపర్ స్టార్` అనే పదానికి నిలువెత్తు రూపం రజినీకాంత్. దశాబ్దాలు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించే ప్రభంజనం మాత్రం ఎప్పటికీ తరగనిది.
By: Sivaji Kontham | 14 Oct 2026 10:24 PM ISTభారతీయ చలనచిత్ర రంగంలో `సూపర్ స్టార్` అనే పదానికి నిలువెత్తు రూపం రజినీకాంత్. దశాబ్దాలు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించే ప్రభంజనం మాత్రం ఎప్పటికీ తరగనిది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ `జైలర్ 2` అక్టోబర్ 15 గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే బొమ్మ పడటానికి కొద్ది గంటల ముందు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
తన అద్భుతమైన స్వరాలతో, రీ-రికార్డింగ్‌తో రజినీ మేనియాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే అనిరుధ్ ఈసారి కేవలం సంగీతంతోనే కాకుండా తన మాటలతోనూ అభిమానుల హృదయాలను టచ్ చేశారు. ``రజినీసార్ తరతరాలుగా మనకు పంచిన ఆనందం.. తెప్పించిన నవ్వులు.. అందించిన గూస్బంప్స్ మాటల్లో చెప్పలేనివి. అర్ధశతాబ్దానికి పైగా సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఆయన మనకు బహుమతిగా ఇచ్చారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న ఈ జ్యోతి లాంటి ఎనర్జీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం`` అంటూ అనిరుధ్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
తన 172వ చిత్రంతో దూసుకొస్తున్న తలైవర్ సంబరంపై స్పందిస్తూ, ``రేపు థియేటర్లలో లైట్లు ఆరిపోతాయి..వెండితెరలు వెలుగుతాయి. కోట్లాది మంది భారతీయుల గుండెల్లో కొలువైన ఈ మహానటుడిపై ప్రపంచం కురిపించే అపారమైన ప్రేమాభిమానాలను చూడటానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం`` అని అనిరుధ్ రాసుకొచ్చారు. అంతేకాకుండా, ``ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు.. ఒకే ఒక్కడు`` అంటూ తలైవర్ ప్రతిష్ఠను సింగిల్ లైన్లో ఆకాశానికెత్తేశారు.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. `జైలర్` మొదటి భాగంలో బిజిఎమ్‌తో థియేటర్లను ఊపేసిన అనిరుధ్ ఈ పార్ట్-2లో అంతకుమించిన వీరవిహారం చేశారనే ప్రచారం ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రాక్స్, బిజిఎమ్ గ్లింప్సెస్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంటే.. థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సినిమా విడుదల క్షణాలు దగ్గర పడుతున్న కొద్దీ అనిరుధ్ షేర్ చేసిన ఈ స్పెషల్ నోట్ `జైలర్ 2`పై ఉన్న అంచనాలను, హైప్‌ను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఎలాంటి రికార్డులను తిరగరాస్తాడో.. వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడటానికి సినీ ప్రియులు, రజినీ అభిమానులు సిద్ధమైపోయారు.
