Begin typing your search above and press return to search.

జైలర్ 2 పాట వివాదం: డాన్సర్ ఈషా బహిరంగ క్షమాపణలు

సూపర్‌స్టార్ రజినీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ `జైలర్ 2`పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 10:33 PM IST
జైలర్ 2 పాట వివాదం: డాన్సర్ ఈషా బహిరంగ క్షమాపణలు
X

సూపర్‌స్టార్ రజినీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ `జైలర్ 2`పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన `అలా బోలేలో` అనే ఫస్ట్ సింగిల్ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో నటి పూర్ణ (షమ్నా కాసిమ్) సాంప్రదాయ కసవు చీరలో అద్భుతమైన స్టెప్పులతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

అయితే ఈ పాట ప్రోమోలో చోటుచేసుకున్న చిన్న సాంకేతిక లోపం నెటిజన్ల కంటపడింది. పాటలోని డ్యాన్స్ ప్రదర్శనలో ఈషా అనే డ్యాన్సర్ చిన్న స్టెప్ మిస్సయినట్లు కొందరు అభిమానులు గుర్తించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఈ విషయంపై స్పందించిన డ్యాన్సర్ ఈషా ఎలాంటి దాపరికం లేకుండా తన తప్పును పెద్ద మనసుతో అంగీకరించారు.

ఈ చిన్న పొరపాటుపై ఈషా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. `స్నేహితులారా నన్ను క్షమించండి. ఇది నా పొరపాటే... మేం ఈ స్టెప్‌ను చాలా సేపు ప్రాక్టీస్ చేయడం వల్ల కొద్దిగా వెనుకబడిపోయాను` అంటూ పోస్ట్ చేశారు. తప్పును హుందాగా అంగీకరించి క్షమాపణలు కోరడం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

మరోవైపు ఈ పాట డ్యాన్స్ పొరపాటు కారణంగానే కాకుండా మరో వివాదం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. ఈ పాటలో ఉపయోగించిన మలయాళ పదాల ఉచ్చారణ సరిగ్గా లేదని కేరళకు చెందిన కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా `ల` శబ్దాలను పలకడంలో తప్పులు దొర్లాయని ఇది మలయాళ భాషను అగౌరవించనట్లుగా ఉందని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇతర భాషల పదాలను వాడేటప్పుడు తగినంత శ్రద్ధ పెట్టాలని సరైన అవగాహన ఉన్న గేయ రచయితలను - గాయకులను ఎంపిక చేసుకోవాలని కేరళ అభిమానులు సూచిస్తున్నారు. మొదటి భాగంలోని `మనసులాయో` పాట తరహాలోనే ఈ పాటను కూడా కేరళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినా? ఉచ్చారణ లోపాలపై వ్యతిరేకత వ్యక్తమవడం గమనార్హం.

ఇలా ఒకవైపు డ్యాన్సర్ ఈషా క్షమాపణలు..మరోవైపు మలయాళ పదాల ఉచ్చారణ వివాదం ద్వారా ఈపాట‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఏది ఏమైనా? రజినీకాంత్ సినిమా పాట కావడంతో దీనిపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వివాదాలను పక్కన పెడితే పూర్తి పాట విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.