Begin typing your search above and press return to search.

ఘట్టమనేని వారసుడి 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్ రిలీజ్!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్‌ ఎంట్రీకి గ్రాండ్‌గా రెడీ అయిపోయాడు.

By:  Madhu Reddy   |   12 July 2026 8:54 PM IST
ఘట్టమనేని వారసుడి శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రిలీజ్!
X

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్‌ ఎంట్రీకి గ్రాండ్‌గా రెడీ అయిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. పక్కా లవ్, యాక్షన్, ఎమోషనల్ ప్యాకేజీలా ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.




అదిరిపోయిన జయ కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్:

తొలి సినిమాతోనే జై కృష్ణ ఘట్టమనేని తన లుక్స్, యాక్టింగ్‌తో అందరినీ షాక్ గురిచేశాడు. ఘట్టమనేని వారసుడిగా మంచి కటౌట్‌తో స్క్రీన్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో క్యూట్‌గా నటిస్తూనే.. యాక్షన్ సీక్వెన్స్‌లలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఇక డెబ్యూ హీరోలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం చూసి టాలీవుడ్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

"తిరుపతిని ఎదిరిస్తా.. నిన్ను వదలను మంగ":

ఈ సినిమాలో శ్రీను, మంగ మధ్య సాగే గాఢమైన ప్రేమకథ మెయిన్ హైలైట్‌గా నిలవనుంది. ట్రైలర్‌లో వచ్చే "అవసరమైతే తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా కానీ నిన్ను వదలను మంగ" అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు గట్టిగా కనెక్ట్ అయింది. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. తన అందం, అభినయంతో రాషా మంచి ఇంప్రెషన్ వేసింది. జై కృష్ణ-రాషా జోడీ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా వర్కవుట్ అయింది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలనిజం:

ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే.. సీనియర్ యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. 'బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు' అనే చాలా క్రూరమైన, పవర్‌ఫుల్ రోల్‌లో ఆయన నటించారు. ఇక తనదైన హావభావాలు, బేస్ వాయిస్‌తో చెప్పే విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మోహన్ బాబు ట్రైలర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరో, విలన్ మధ్య వచ్చే మైండ్‌బ్లోయింగ్ సీన్లు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి.

అజయ్ భూపతి మార్క్ లవ్ అండ్ యాక్షన్:

ఆర్‌ఎక్స్‌ 100 లాంటి రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి, ఈ సినిమాను కూడా తనదైన శైలిలో పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో మలిచారు.ఇక అశ్విని దత్ సమర్పణలో, పి.కిరణ్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో విజువల్ వండర్‌గా నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ట్రైలర్‌తోనే బ్లాక్‌బస్టర్ బజ్ క్రియేట్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఘట్టమనేని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సాలిడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా కనిపిస్తోంది. మరి ఫస్ట్ మూవీతోనే సూపర్ రెస్పాన్స్ అందుకున్న జయ కృష్ణ ఘట్టమనేని, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసి తన తాత, బాబాయ్‌ల లెగసీని ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.