ఇన్ స్పెక్టర్ సాబ్ ఒకే పాత్రతో గిన్నీస్ రికార్డు!
ఏ నటుడైనా ఒక పాత్రను ఒకేసారి పోషించాలనుకుంటున్నాడు. మళ్లీ మళ్లీ అదే పాత్ర వచ్చినా? అదే తరహా రోల్ ఆఫర్ చేసినా నో చెప్పేస్తుంటారు.
By: Srikanth Kontham | 27 Nov 2025 2:00 AM ISTఏ నటుడైనా ఒక పాత్రను ఒకేసారి పోషించాలనుకుంటున్నాడు. మళ్లీ మళ్లీ అదే పాత్ర వచ్చినా? అదే తరహా రోల్ ఆఫర్ చేసినా నో చెప్పేస్తుంటారు. ఒకసారి పోషించిన రోల్ మళ్లీ పోషించడం ఏంటనే విషయాన్ని రిజెక్ట్ చేసే ముందు వ్యక్తం చేస్తుంటారు. కానీ అవకాశాలు రాని కొంతమంది తప్పక పోషిస్తుంటారు. వారు కూడా ఆ పాత్రను మహా అయితే ఓ పది సినిమాల వరకూ పోషించగలరు. కానీ ఓ నటుడు ఒకే పాత్రను 144 సార్లు పోషించి ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకే ఎక్కారు. అతడే బాలీవుడ్ నటుడు జగదీష్ రాజ్.
ఇతన్ని అంతా `ఇన్ స్పెక్టర్ సాబ్` అని పిలుస్తుంటారు. ఎందుకంటే 144 సినిమాల్లో కూడా ఆయన ఇన్ స్పెక్టర్ పాత్రలు మాత్రమే పోషించారు . 1928 లో బ్రిటీష్ ఇండియాలోని పాకిస్తాన్ లోని సర్గోదా ఊరిలో జన్మించారు. 11వ ఏటే బాల నటుడిగా 1939 లో ఎంట్రీ ఇచ్చారు. 1955 నుంచి పూర్తి స్థాయి నటుడిగా మారారు. 2004 వరకూ వరసగా 260 చిత్రాల్లో నటించారు. 1956 లో రిలీజ్ అయిన `సీఐడీ`లో తొలిసారి ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారు. అటుపై `దీవార్`, `డాన్`, `శక్తి`, `మజ్జూర్`, `ఇమాన్ ధరమ్`, `జూసూస్`, `సిల్సిలా`, `ఐనా`, `భేషరామ్` లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.
వీటన్నింటిలోనూ ఆయన ఇన్ స్పెక్టర్ రోల్ తోనే అలరించారు. చివరిగా `మేరీ బీవీకా జవాబ్ నహిన్` అనే సినిమాలో నటించారు. ఇందులో డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ గా నటించారు. పోలీస్ పాత్రలతో పాటు, న్యాయమూర్తి, విలన్ పాత్రలు కూడా పోషించారు. కానీ అవేవి ఇవని గుర్తింపును పోలీస్ పాత్రలు ఇచ్చాయి. అలా ఆ పాత్రలతో గిన్నీస్ రికార్డు కూడా సొంతమైంది. తెలుగులో తాగుబోతు రమేష్ కూడా చాలా సినిమాల్లో తాగు బోతు పాత్రలు పోషించాడు. ఇతర మరే పాత్రలు పోషించినా? ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అయ్యేవి కాదు.
బేసిక్ గా ఆయన మద్యానికి దూరంగానే ఉంటాడు. తొలిసారి ఓ సినిమాలో ఆ పాత్ర పోషించడం..అది సక్సెస్ అవ్వడంతో..అందులో బాగా నటించడంతో చాలా మంది దర్శకులు ఆ పాత్రలోనే కొనసాగించారు. జగదీష్ రాజ్ 2013లోనే స్వర్గస్తుల య్యారు. ఆయన వారసత్వం పుణికి పుచ్చుకుని కుమార్తె అనితారాజ్ ఎంట్రీ ఇచ్చారు. 1981 లోనే `ప్రేమ్ గీత్` సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 80, 90 దశకాల్లో చాలా చిత్రాల్లో నటించారు.
