హోస్టింగులో NBK తర్వాత ఈయనే
ఇప్పుడు బుల్లితెర హోస్ట్ గాను అతడు అదే తీరుగా రాణిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆహా-తెలుగు ఓటీటీలో అన్ స్టాపబుల్ షోతో బాలయ్య హోస్ట్ గా బిగ్ సక్సెస్ అయిన తీరు ఆశ్చర్యపరిచింది.
By: Sivaji Kontham | 21 Aug 2025 5:00 AM ISTతెలివిగా టైమింగ్ తో కొట్టడంలో కొందరు ముందుంటారు. టాలీవుడ్‌లో అలాంటి ప్రముఖుడు జగ్గూభాయ్ అలియాస్ జగపతి బాబు. హీరోగా పనైపోయింది అనే విమర్శలొస్తున్న సమయంలో, ఎలాంటి నామోషీకి పోకుండా విలన్ అయ్యాడు. తెలివిగా నటసింహా నందమూరి బాలకృష్ణ లాంటి అగ్ర హీరో సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. `లెజెండ్`లో ఎన్బీకేతో నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ నటించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా రజనీకాంత్, చరణ్, మహేష్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గాను, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు.
సినీరంగంలో జగ్గూభాయ్ ప్రయాణం చాలా దూరం సాగింది. అతడు సహాయ నటుడిగా విజయవంతమైన కెరీర్ ని రన్ చేస్తున్నాడు. తనతో పాటు సినీప్రయాణం ప్రారంభించి మధ్యలోనే అలసిపోయి సక్సెస్ లేక డీలా పడిపోయిన చాలామందితో పోలిస్తే, అతడు తెలివైన ఎత్తుగడలతో ఎప్పటికప్పుడు ప్లాన్‌ను తనకు అనువుగా మలుచుకుంటూ, చదరంగంలో గెలుస్తున్నాడు.
ఇప్పుడు బుల్లితెర హోస్ట్ గాను అతడు అదే తీరుగా రాణిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆహా-తెలుగు ఓటీటీలో అన్ స్టాపబుల్ షోతో బాలయ్య హోస్ట్ గా బిగ్ సక్సెస్ అయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఆయనకు సాటిలేరెవ్వరూ అని నిరూపణ అయింది. ఇప్పుడు ఆయన తర్వాత మళ్లీ ఈయనే కనిపిస్తున్నారు. `జయమ్ము నిశ్చయమ్మురా` యాంకర్ గా జగపతి బుల్లితెరపై బాగానే కనిపిస్తున్నాడు. అతడి హోస్టింగ్ అందరికీ కనెక్టవుతోంది. ఫ్రీ అండ్ ఫ్లో స్పీచ్ అతడి ప్రత్యేకత.. నిజాయితీగా సూటిగా మాట్లాడతాడు.. సరదా ఫన్ సెటైర్ ఉన్నాయి.. అది జగ్గూకి పెద్ద ప్లస్..
కొలీగ్స్ రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి హీరోలతో పోలిస్తే తెలివైన ఆట ఆడుతున్న జగపతి విలనీలు, యాంకరింగులు అంటూ కెరీర్ పరంగా గ్యాప్ అన్నది లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఒక నటుడికి మాత్రమే కాదు.. ఏ రంగంలో అయినా తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు, కనీస ఉపాధిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగడమే గొప్ప విజయంగా చెప్పొచ్చు. ఈ విషయంలో జగపతి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జయమ్ము నిశ్చయమ్మురా షో జీటీవీలో టెలీకాస్ట్ అవుతోంది. ఇందులో సెలబ్రిటీల ఇంటర్వ్యూల్లో వారి కుటుంబీకుల్లో ముఖ్యులను అదే షోకి ఆహ్వానిస్తూ.. సర్ ప్రైజింగ్ గా, సరదాగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కింగ్ నాగార్జున, శ్రీలీల ఎపిసోడ్స్ డీటెయిల్స్ వచ్చాయి. తదుపరి టాలీవుడ్ అగ్ర హీరోలతో జగపతిబాబు ఈ కార్యక్రమాన్ని మరింత స్పెషల్ గా మార్చబోతున్నారట. కాఫీ విత్ కరణ్, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సహా చాలా షోలు ఈ తరహానే. కానీ జగపతి ఛరిష్మాతో జయమ్ము నిశ్చయమ్మురా విజయవంతంగా ముందుకు సాగుతోంది.
