జగపతి-నాగార్జున... ఇద్దరూ భలే తప్పించుకున్నారు!
తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో టాక్ షో రాబోతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ టాక్ షోలతో వచ్చారు.
By: Ramesh Palla | 11 Aug 2025 1:19 PM ISTతెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో టాక్ షో రాబోతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ టాక్ షోలతో వచ్చారు. బాలకృష్ణ ఇప్పటికే అన్‌స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా దూసుకు పోతుంది. త్వరలో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాడని తెలుస్తోంది. రానా సైతం ఇప్పటికే పలు టాక్ షో లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సీనియర్ హీరో జగపతి బాబు టాక్ షో కి రెడీ అయ్యాడు. 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' అనే టాక్ షో తో జగపతిబాబు జీ5 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాక్ షో లో మొదటి గెస్ట్ గా నాగార్జున వచ్చాడు. అందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. జీ5 లో ఈ షో ను ఆగస్టు 15న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన రెండు రోజుల తర్వాత జీ తెలుగు లో అంటే ఆగస్టు 17న టెలికాస్ట్ కాబోతుంది.
టబు, రమ్యకృష్ణలో ఎవరు ఫేవరెట్
నాగార్జున మొదటి ఎపిసోడ్ కి గెస్ట్‌గా రావడంతో ఆసక్తి పెరిగింది. జగపతిబాబు తన స్నేహితుడు అంటూ నాగార్జునను పరిచయం చేయడం ద్వారా ఇద్దరి మధ్య ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున మాత్రమే కాకుండా అక్కినేని వెంకట్, వారి సోదరి సైతం ఈ షో లో పాల్గొనడంతో ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా చర్చకు వచ్చాయా అనేది చూడాలి. ప్రోమోలో మాత్రం నాగార్జున, జగపతిబాబు మధ్య కామెడీ చర్చ జరిగింది. టబు, రమ్యకృష్ణలలో ఎవరు నీకు మోస్ట్ ఫేవరెట్ కో స్టార్ అంటూ జగపతి బాబు ప్రశ్నించిన సమయంలో నాగార్జున చాలా తెలివిగా అలాంటివి చెప్పకూడదు, నేను చెప్పను అనడంతో జగపతిబాబు గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత సౌందర్య, రమ్యకృష్ణలో నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అంటూ నాగార్జున ప్రశ్నించగా జగపతి బాబు కూడా తెలివిగా తప్పించుకున్నారు.
నాగార్జునలో ఎప్పుడు మన్మధుడు కనిపించాడు
అక్కినేని వెంకట్ తో జగపతిబాబు మాట్లాడుతూ.. నాగార్జునలో మొదటి సారి మన్మధుడు ఎప్పుడు కనిపించాడు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు అక్కినేని వెంకట్ సరదాగా నీ తర్వాతే మన్మధుడు అన్నాడు. దాంతో జగపతిబాబు అయి వేరేలే అంటూ సరదాగా ఆ టాపిక్ ను దాట వేశాడు. మొత్తానికి నాగార్జున, జగపతిబాబుల యొక్క ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూసే విధంగా ప్రోమో కట్ చేశారు. ఆగస్టు 15 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ లోనే కాకుండా బుల్లి తెరపైనా ఈ ఎపిసోడ్ కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కూలీ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నాగార్జున
నేను ఏదో చిన్న చిన్న విలన్ పాత్రలు చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు అందులో దూరుతున్నావు అంటూ కూలీలో నాగార్జున విలన్‌గా నటించడం పట్ల జగపతిబాబు ప్రశ్నించాడు. అందుకు నాగార్జున ఎలాంటి సమాధానం ఇచ్చాడు అనేది ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నాగార్జున కూలీ సినిమా ప్రమోషన్ సమయంలో అధికారికంగా తాను విలన్‌గా నటించాను అన్నాడు. కుబేర సినిమాలోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ముందు ముందు నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో హీరోగానూ నాగార్జున సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ ఏడాది చివర్లో నాగ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.
