సూపర్ మార్కెట్లో సందడి చేసిన జగ్గూ భాయ్.. పాపం చిన్నపిల్లాడితో..
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇటీవల హైదరాబాద్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చేసిన అల్లరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
By: Madhu Reddy | 5 Aug 2026 12:19 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇటీవల హైదరాబాద్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చేసిన అల్లరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఒక సాధారణ కస్టమర్‌లా సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి, చిన్నపిల్లాడిలా సందడి చేస్తూ ఆయన ఓ ఫన్నీ వ్లాగ్ షూట్ చేశారు. ముఖంపై చిన్న గాయాలు ఉన్నప్పటికీ, చాలా క్యాజువల్‌గా అక్కడ వస్తువులను చూపిస్తూ అభిమానులను అలరించిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
20 ఏళ్ల తర్వాత సూపర్ మార్కెట్లో సందడి:
స్క్రీన్ పై రాయల్ లుక్, స్టైలిష్ విలనిజంతో మెప్పించే జగపతి బాబు, బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. తాజాగా తన ఇంటి సమీపంలోని సూపర్ మార్కెట్‌లోకి వెళ్లిన ఆయన, అక్కడున్న వస్తువులను వివరిస్తూ ఒక ఫన్నీ వ్లాగ్ చేశారు. ఇక సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇలా సూపర్ మార్కెట్‌లో అడుగుపెట్టానని చెబుతూ, ఒక చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా అల్లరి చేస్తూ సందడి చేశారు. ఇటీవల ముఖానికి అయిన చిన్న గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఇక ఇలా సరదాగా కనిపించడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారితో ఊహించని ఫన్నీ ఇన్సిడెంట్:
ఈ వ్లాగ్ షూట్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. జగపతి బాబును చూసిన ఒక చిన్నారి, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చింది. సరేనని జగ్గు భాయ్ కూడా నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. అయితే, సరిగ్గా ఫొటో తీసే సమయానికే ఆ బాబు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక ఆ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్, జగపతి బాబు రియాక్షన్ చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఈ ఫన్నీ సీన్ ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త వైవిధ్యం:
సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగ్గు భాయ్, ఇటీవలే 'పెద్ది' చిత్రంలో అప్పలసూరి అనే పల్లెటూరి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అలాగే 'వదలా' హారర్ థ్రిల్లర్ చిత్రంలో సుదీర్ఘ కాలం తర్వాత హీరోయిన్ లయతో కలిసి నటించగా, 'గోదారి గట్టుపైన' సినిమాలో నాయిక తండ్రిగా అలరించారు. ఇక త్వరలోనే ఆయన 'న్యూటన్స్ 3వ లా' మరియు 'సలార్ పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం' వంటి భారీ చిత్రాలలో సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
వెండితెరపై ఎంతటి పవర్ ఫుల్ పాత్రలు చేసినా, రియల్ లైఫ్‌లో మాత్రం జగ్గు భాయ్ ఎంతో సరదాగా ఉంటారని ఈ వీడియో మరోసారి నిరూపించింది. సీనియర్ నటుడైనా కూడా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక సామాన్యుడిలా సూపర్ మార్కెట్లో సందడి చేయడం, అభిమానులతో కలవడం ఆయనలోని మంచి మనసును తెలియజేస్తుంది. ఈ సరదా వ్లాగ్ చూసిన నెటిజన్లు జగపతి బాబు టైమింగ్‌కు, ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
