ఉప్పెన 'ఫాదర్'గా జగ్గూ భాయ్ ఉంటే ఇంకెలా ఉండేదో!
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు మాత్రం విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
By: M Prashanth | 29 May 2026 6:19 PM ISTఒక పాత్ర హిట్ అయితే.. ఆ రోల్ లో నటించిన యాక్టరే గుర్తుండిపోతారు. కానీ ఆ రోల్ మొదట ఎవరి దగ్గరకు వెళ్లింది? వాళ్లు చేసి ఉంటే ఎలా ఉండేది? అనే చర్చలు కూడా అప్పుడప్పుడు ఆసక్తి కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి చర్చకే కారణమయ్యారు సీనియర్ నటుడు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు మాత్రం విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా సినిమాలో కీలక పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా లెజెండ్ తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. అప్పటి నుంచి ప్రతి సినిమాలో కొత్త యాంగిల్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఉప్పెన సినిమాలోని రాయణం పాత్ర కోసం మొదట తననే అనుకున్నారని జగపతి బాబు వెల్లడించారు. కథ చెప్పేందుకు డైరెక్టర్ ఇంటి వరకు కూడా వచ్చాడని, కానీ తర్వాత ఆలోచన మార్చుకుని వెళ్లిపోయాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. తర్వాత ఆ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత రాయణం రోల్ ఎంత ఎఫెక్ట్ చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కూతురి ప్రేమకు ఒప్పుకోని ఓ తండ్రిగా విజయ్ సేతుపతి యాక్టింగ్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. ఆ రోల్ లో క్రూయాలిటీ, ఎమోషన్స్ రెండింటినీ ఈక్వల్ గా చూపిస్తూ ఆయన తనదైన నటనతో మెప్పించారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో మరో ఆసక్తికర ఆలోచన మొదలైంది. అదే పాత్రను జగపతి బాబు చేసి ఉంటే ఎలా ఉండేదన్నది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ లో కూడా ఎమోషనల్ ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
ముఖ్యంగా కోపం, బాధ, అహంకారం ఉన్న పాత్రల్లో జగపతి బాబు చాలా స్పెషల్ గా కనిపిస్తారు. అందుకే రాయణం పాత్రలో ఆయన ఉంటే మరో రకమైన ఇంటెన్సిటీ కనిపించేదని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు నిజాయితీగా మాట్లాడిన విషయాన్ని కూడా జగపతి బాబు సరదాగా చెప్పడం ఆకట్టుకుంది. అప్పట్లో విజయ్ సేతుపతికి మార్కెట్ ఎక్కువగా ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు చెప్పాడని వెల్లడించారు. దానిపై ఎలాంటి అసంతృప్తి లేకుండా నిజం చెప్పారు.. అదే చాలు అన్నట్లుగా స్పందించడం జగపతి బాబు పర్సనాలిటీ చూపించింది.
కాగా, ఇండస్ట్రీలో ఇలాంటి మార్పు సహజమే. ఒకరి దగ్గరికి వెళ్లిన పాత్ర చివరికి మరొకరి చేతుల్లోకి వెళ్లి పెద్ద హిట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఆ మిస్ అయిన ఛాన్సులు గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉప్పెన రాయణం రోల్ కూడా అలాంటి ఉదాహరణగానే మారింది. ఇక ప్రస్తుతం జగపతి బాబు నటించిన పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆయన పోషించిన అప్పలసూరి రోల్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు మిస్ అయిన బుచ్చిబాబు సినిమాలో ఇప్పుడు ఆయనకు కీలక పాత్ర దక్కడం విశేషం.
