చరణ్ సూపర్‌మ్యాన్.. హీమ్యాన్ : 'థాంక్స్ మీట్'లో జగపతిబాబు ప్రశంసలు
గతంలో `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై అద్భుతమైన నటనను పండించిన సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా `పెద్ది` చిత్రంతో మరోసారి ఆనాటి మ్యాజిక్‌ను పునరావృతం చేశారు.
By: Sivaji Kontham | 9 Jun 2026 9:45 AM ISTగతంలో `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై అద్భుతమైన నటనను పండించిన సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా `పెద్ది` చిత్రంతో మరోసారి ఆనాటి మ్యాజిక్‌ను పునరావృతం చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించిన `థాంక్స్ మీట్`లో జగపతిబాబు మాట్లాడిన మాటలు, వ్యక్తపరిచిన భావోద్వేగాలు వేదిక వద్ద ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారాయి.
ఈ విజయోత్సవ సభలో జగపతిబాబు మాట్లాడుతూ ..``పెద్ది ఆడాడు... పోరాడాడు... గెలిచాడు`` అంటూ చిత్ర కథానాయకుడి పాత్ర స్వభావాన్ని ఎంతో పవర్‌ఫుల్‌గా విశ్లేషించారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని... బాక్సాఫీస్ పోరాటంలో నిలబడి మరీ ఘనవిజయం సాధించిందని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్లు.. వందల కోట్ల వసూళ్ల లెక్కలు పక్కన పెడితే.. మూడు వందల రూపాయల టికెట్ కొని థియేటర్‌కు వచ్చే సామాన్య ప్రేక్షకుడే ఒక సినిమా అసలైన జాతకాన్ని నిర్ణయిస్తాడని.. అంతటి శక్తి ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనదని (వల్నరబుల్), ఇలాంటి వాతావరణంలో దర్శకుడు బుచ్చిబాబు ఒక మెగా పవర్ స్టార్ స్థాయి ఉన్న హీరోకు ఈ తరహా భిన్నమైన కథను చెప్పి ఒప్పించడం సామాన్యమైన విషయం కాదని జగపతిబాబు కొనియాడారు. కొద్దిగా అటు ఇటు అయినా ప్రేక్షకులు తిరస్కరించే ప్రమాదం ఉన్న ఇంతటి `రేజర్ ఎడ్జ్` సబ్జెక్టును నమ్మి... దానికి పూర్తి మద్దతుగా నిలిచిన నిర్మాత ధైర్యాన్ని ఆయన అభినందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన అసాధారణ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని.. తను కేవలం సాధారణ మనిషి (మాన్) కాదు.. ఒక `సూపర్‌మ్యాన్, హీ-మ్యాన్` అంటూ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా ఒక కల్ట్ క్లాసిక్‌గా ఆకట్టుకుంటోందని... ఇకపై ఏ రోజైనా బాక్సాఫీస్ వద్ద `పెద్ది` రోజేనని జగపతిబాబు ధీమా వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందే తాను చెప్పినట్లుగా ఈ చిత్రంలో తను పోషించిన పాత్ర తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్‌గా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి తాను కొంచెం ఎక్కువ మాట్లాడానేమో అని భయపడ్డానని... కానీ ప్రస్తుత కలెక్షన్లు.. ప్రేక్షకుల అఖండ స్పందన చూస్తుంటే తాను అప్పుడు తక్కువే మాట్లాడాననిపిస్తోందని నవ్వుతూ పేర్కొన్నారు.
ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ జగపతిబాబు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి గారు స్వయంగా ట్వీట్ చేస్తూ `నా బ్రదర్ జగపతిబాబు`అని సంబోధించడం తన జీవితంలో అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా సాధించిన ఘనవిజయం వల్ల పరిశ్రమలో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారని... తనకు ఇంతటి అద్భుతమైన పాత్రను ప్రసాదించిన దర్శకుడు బుచ్చిబాబుకు... తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్‌కు ఎప్పటికీ కృతజ్ఞతుడనై ఉంటానని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.
